ఫిర్యాదుల కోసం కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు: కలెక్టర్‌

Apr 3,2024 22:35
ఫిర్యాదుల కోసం కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు: కలెక్టర్‌

చిత్తూరు అర్బన్‌: జిల్లాలో పెన్షన్‌ల పంపిణీపై వచ్చే వదంతులు, అపోహలను నమ్మి భయాందోళనలకు గురికావద్దవని జిల్లా కలెక్టర్‌ ఎస్‌.షణ్మోహన్‌ తెలిపారు. బుధవారం జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ పి.శ్రీనివాసులు, డిఆర్‌ఓ బి.పుల్లయ్యతో కలసి కలెక్టర్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ సామాజిక పెన్షన్ల పంపిణీపై వచ్చే నిరాధారమైన వార్తలను, వదంతులను నమ్మి లబ్ధిదారులు భయాందోళనలకు గురికావద్దని కోరారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్‌ల పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. జిల్లాలో ప్రతి నెలా 2,74,553 మంది లబ్ధిదారులకు రూ.80.39 కోట్లు పెన్షన్ల పంపిణీ చేపడుతున్నామని తెలిపారు. ఇందులో అధికంగా 1,46,496 మందికి వద్ధాప్య పెన్షన్‌ పంపిణీ చేయడం జరుగుతున్నదన్నారు. పెన్షన్ల పంపిణీకి గతంలో సచివాలయాల వారీగా వాలంటీర్‌ ద్వారా ఇంటింటికీ పెన్షన్‌లు పంపిణీ చేయడం జరిగేదని, ఎన్నికల కమిషన్‌ ఆదేశాల ప్రకారం వాలంటీర్లను పెన్షన్‌ పంపిణీకి వినియోగించరాదనే నిబంధనలతో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామ, వార్డు సచివాలయాల వద్ద గ్రామ,వార్డు సచివాలయ సిబ్బందితో పెన్షన్‌ల పంపిణీ చేపడుతున్నామని తెలిపారు. పెన్షన్‌దారులకు బ్యాంక్‌ అకౌంట్లు లేకపోవడం, బ్యాంక్‌ అకౌంటుకు ఆధార్‌ సీడ్‌ కాకపోవడం ద్వారా డిబిటి పద్ధతిలో పెన్షన్‌ చెల్లింపుకు ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉన్నందున సచివాలయాల ద్వారా పంపిణీ చేపట్టడం జరిగిందన్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సచివాలయాలకు రాగలిగిన వారికి 3వ తేదీ మధ్యాహ్నం నుండి పెన్షన్ల పంపిణీ చేస్తామని, రాలేని వారికి మూడు రోజుల తరువాత ఇంటి వద్దకే వెళ్ళి సచివాలయ సిబ్బందితో పంపిణీ చేసే కార్యక్రమం చేపట్టడం జరుగుతుందన్నారు. సార్వత్రిక ఎన్నికలలో భాగంగా అధిక భాగం సచివాలయ సిబ్బంది ఎన్నికల విధులలో నిగమైన కారణంగా పెన్షన్‌ల పంపిణీ దాదాపుగా ఒక వారం నుండి 10 రోజుల సమయం పట్టే అవకాశం ఉందన్నారు. ఎండలు అధికంగా ఉన్న సందర్భంగా పెన్షన్‌ల కోసం సచివాలయాలకు వచ్చే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఏఎన్‌ఎంలు ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను సచివాలయాలలో సిద్ధం చేసుకోవాలని తెలిపారు. పెన్షన్‌ల పంపిణీలో జాప్యం లేక ఇతర సమస్యల ఫిర్యాదు కొరకు 63004 33367 నెంబర్‌తో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలో పలమనేరు, పుంగనూరు, కుప్పం నియోజకవర్గాలలో నీటి ఎద్దడి ఉండే అవకాశం ఉందని, ప్రభుత్వం తరఫున చర్యలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. సమావేశంలో డిఆర్‌డిఏ పిడి తులసి, డిఎల్‌డిఓ రవికుమార్‌ అధికారులు పాల్గొన్నారు.

➡️