వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండండికమిషనర్ పి.నరసింహ ప్రసాద్‌ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్: వర్షాలు నేపథ్యంలో నగరపాలక ప్రజారోగ్య విభాగం, ఇంజనీరింగ్ విభాగం అధికారులు అప్రమత్తంగా ఉండాలని, వర్షపు నీరు నిల్వచేరకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ పి.నరసింహ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం కమిషనర్ నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఎమ్మెస్సార్ కూడలిలో డ్రైనేజీలను పరిశీలించారు. డ్రైనేజీలో వ్యర్ధాలు లేకుండా ఎప్పటికప్పుడు తొలగించాలని, వర్షాలు పడిన సమయంలో నీటి ప్రవాహానికి అడ్డం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మామిడికాయల మార్కెట్ యార్డ్ వద్ద కల్వర్టర్‌ను పరిశీలించారు. కల్వర్టర్‌లో నీటి ప్రవాహానికి ఆటంకాలు లేకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి వ్యర్థాలు తొలగించాలని అధికారులను ఆదేశించారు. వర్షాలు నేపథ్యంలో కాలువల్లో, లోతట్టు ప్రాంతాల వద్ద నీరు నిల్వచేరకుండా వేగంగా వెళ్లేలా పారిశుద్ధ్య నిర్వహణ పక్కాగా జరగాలన్నారు. కమిషనర్ వెంట అధికారులు, వార్డు కార్యదర్శులు పాల్గొన్నారు.