మాజీ మంత్రి గల్లా అరుణకుమారి
ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్: సనాతన ధర్మం, మాత ప్రేమను తెలియజేసే విధంగా దేవకీ నందన వాసుదేవ చిత్రంను నిర్మించడం జరిగిందని, చిత్రం చాలా బాగుందని మాజీ మంత్రి గల్లా అరుణకుమారి తెలిపారు. చిత్తూరు రాఘవ థియేటర్లో ప్రదర్శింపబడుతున్న తన మనవడు గల్లా అశోక్ నటించిన దేవకీ నందన వాసుదేవ చిత్రాన్ని అరుణకుమారి, టిడిపి నాయకులతో కలిసి మంగళవారం తిలకించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా సనాతన ధర్మాన్ని.. మాత ప్రేమను మరింతగా పెంపొందించే విధంగా చిత్రాన్ని తీయడం జరిగిందన్నారు. ఈ చిత్రంలో తల్లి ప్రేమతో పాటు హాస్యం, వినోదం, సంగీతం, ఫైట్స్, ఇతర సన్నివేశలను బాగా తీయడం జరిగిందన్నారు. తాను ఇప్పటికే రెండుసార్లు చూడడం జరిగిందని ఈ చిత్రం అందర్నీ ఆకట్టుకుంటున్నదని పేర్కొన్నారు. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు సైతం చూడదగిన కుటుంబ కథాచిత్రమని తెలిపారు. సినిమా విజయవంతంగా ప్రదర్శిస్తుండడంతో సినిమా ధియేటర్ వద్ద భారీ కేక్‌ను కట్ చేసి టిడిపి నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు పంచిపెట్టారు. చుడా చైర్‌పర్సన్ కటారి హేమలత, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, మాజీ ఎంపీ దుర్గా రామకష్ణ, చిట్టిబాబు, మోహన్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.