ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్: కేంద్రంలోని బిజెపి సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తమ విధానాల్లో మార్పు లేదని స్పష్టంగా ప్రకటించింది. కానీ కుక్క తోక వంకర అన్న చందంగా మోదీ ప్రభుత్వం మరోసారి రుజువు చేసుకుంది. ఎన్‌డీఏలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ, జనసేన ప్రభుత్వాలు రాష్ట్రంలోనూ అవే విధానాలను అమలు చేస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్త పిలుపులో భాగంగా చిత్తూరు కలెక్టరేట్ ఎదుట మంగళవారం సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్‌టియు, రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారీగా శంఖారావాన్ని పూరించారు. మొదట సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు వాడ గంగరాజు రాజ్యాంగ ప్రతిమను చదవి ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.సురేంద్రన్, ఏఐటియుసి దాసరి చంద్ర, ఐఎఫ్‌టియు జిల్లా అధ్యక్షురాలు జ్యోతి మాట్లాడుతూ సంపదను సృష్టించే కార్మిక వర్గం, దేశానికి అన్నం పెట్టే రైతాంగాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విచ్ఛిన్నం చేస్తున్నాయని అన్నారు. కార్మిక, రైతాంగ వ్యతిరేక విధానాల వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ బడా పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహిస్తున్నారని అన్నారు. కేంద్రంలోని మతోన్మాద బిజెపి ప్రభుత్వం రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని పార్లమెంట్ సాక్షిగా చెబుతోందని, రాజ్యాంగాన్ని రద్దు చేసి మనుధర్మ శాస్త్రాన్ని ప్రవేశపెడతామని చెప్తున్న మతోన్మాద బీజేపీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కార్మికులకు నెలకు ఇవ్వాల్సిన రూ.26వేలు కనీస వేతనాలు ఇవ్వకుండా గత పది సంవత్సరాల నుంచి ఏమాత్రం వేతనాలు పెంచకపోవడం దుర్మార్గమన్నారు. ధరలు రెట్టింపుగా పెరుగుతున్నా, సుప్రీంకోర్టు చెప్పిన స్కీం కార్మికులు, అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్నం భోజన కార్మికులను కార్మికులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. కార్మికులు ఎంతకాలం పనిచేసిన పర్మినెంట్ చేయకూడదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించడం సిగ్గుచేటు అన్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ రంగ సమస్యల ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని, దుర్మార్గమైన లేబర్ కోడ్స్‌ను వెంటనే రద్దు చేయాలని, కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే స్కీం వర్కర్లకు పెన్షన్, గ్రాడ్యూటీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు చేయాలని, రైతుల ఉత్పత్తులకు ఉత్పత్తి ఖర్చు కుటుంబ శ్రమ విలువతో పాటు మరో 50శాతం కలిపి కనీస మద్దతు ధర నిర్ణయించాలని డిమాండ్ చేశారు. అసంఘటిత రంగంలో కార్మికులైన భవన, హమాలీ, ఆటో, రవాణా రంగం తదితర సామాజిక సంక్షేమం అమలు చేయాలని డిమాండ్ చేశారు. అధిక ధరలు తగ్గించి ప్రజలపై భారం పడకుండా చూడాలని, అవినీతిని పెంచి పోషిస్తూ దేశ సంపదను కొల్లగొడుతున్న ఆదానిని వెంటనే అరెస్టు చేయాలన్నారు. రాజ్యాంగ స్ఫూర్తితో దేశాన్ని కాపాడుకోవడానికి కార్మికులు రైతాంగం ప్రజలు మరో పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు గిరిధర్ గుప్తా, జ్యోతి, వరలక్ష్మి, గంగ, వ్యవకాసం జిల్లా కార్యదర్శి ఓబుల్ రాజు, ఐద్వా జిల్లా కార్యదర్శి భువనేశ్వరి, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి ఈశ్వర్, ఏఐటియుసి నాయకులు రమాదేవి, ప్రభావతి, జయకుమారి, ఐఎఫ్‌టియు నాయకులు సుబ్రమణ్యం, రైతు సంఘం నాయకులు దామోదర్ నాయుడు పాల్గొన్నారు.