ప్రభుత్వ విద్యారంగ బలోపేతానికి కృషి

Oct 27,2024 23:31
ప్రభుత్వ విద్యారంగ బలోపేతానికి కృషి

ప్రజాశక్తి – చిత్తూరుఅర్బన్‌: ప్రభుత్వ విద్యారంగ అభివృద్ధికి కృషి చేయడంతో పాటు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు చిత్తూరు జిల్లా నూతన డిఈవో బి వరలక్ష్మి తెలిపారు. ‘ప్రజాశక్తి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జిల్లాలో పని చేయడం ఎంతో సంతోషంగా వుందన్నారు. చిత్తూరు జిల్లాలో ఏడీ సూపరిండెంట్‌గా పని చేసిన అనుభవంతో జిల్లాలోని ప్రభుత్వ విద్యావ్యస్థను బలోపేతం చేసేందుకు తోడ్పడుతుందన్నారు. ప్రభుత్వ విద్యాలయాల్లోని విద్యార్థు లకు అనుభవజ్ఞలైన ఉపాధ్యాయుల విద్యాబోధన తో విద్యార్థుల్లో క్రమ శిక్షణతో కూడిన విద్యను అందిస్తున్నా మన్నారు.ప్రజాశక్తి : ప్రభుత్వ విద్యారంగ బలోపేతానికి ఎలాంటి చర్యలు తీసుకోనున్నారు..? డిఈవో: ప్రధానంగా ఉపాధ్యాయుల వ్యవస్థ బాగుంటే విద్యావ్యవస్థ బాగుంటుంది. ఉపాధ్యాయులకు నేటి పరిస్థితికి అనుగుణంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు శిక్షణ ఇచ్చి ప్రభుత్వ విద్యారంగ బలోపేతానికి కృషి చేస్తున్నాం. ప్రజాశక్తి : ఉపాధ్యాయులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు.. ఎలా పరిష్కరిస్తారు…? డిఈవో: ఉపాధ్యాయులకు స్థానిక జిల్లా విద్యాశాఖలో ఉన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు కృషి చేస్తున్నాం.. ప్రభుత్వ స్థాయిలో ఉన్న సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాం. ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి ఐక్యంగా జిల్లాలో ప్రభుత్వ విద్యావ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తాం.. ప్రజాశక్తి : మధ్యాహ్న భోజన కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు.. ఎలా పరిష్కరిస్తారు? డిఈవో: ప్రధానంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం తప్పని సరి.. పెండింగ్‌ జీతాల విషయం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరగా ఇచ్చేలా ప్రయత్నిస్తాం.. చిత్తూరు జిల్లాలో 2,475 ప్రాథమిక, ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలలున్నాయి. వీటిల్లో 1,74,524 మంది విద్యార్థినివిద్యార్థులు మధ్యాహ్న భోజనం చేస్తున్నారు. 4,603 స్వయం సహాయ సంఘాలు మధ్యహ్న భోజనాన్ని విద్యార్థులకు అందిస్తున్నాయి.ప్రజాశక్తి : మోడల్‌ స్కూల్‌ నిర్వహణ ఎలా ఉంది..? డిఈవో: జిల్లాలో ఏడు ఆదర్శ పాఠశాలలో ఆరు నుండీ ఇంటర్‌ వరకు 4,736 మంది విద్యార్థినివిద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఇందులో ఐదు బాలికల వసతి గృహాల్లో ఐదువందల మంది బాలికలు వసతి పొందుతున్నారు. ఒక్కో బాలికల వసతి గృహంలో వంద మందికి ప్రవే శం కల్పిం చాం..ప్రజాశక్తి : పదో తరగతి విద్యార్థులపై ఎలాంటి శ్రద్ధ తీసు కుంటున్నారు? డిఈవో: ఈ విద్యా సంవత్సరంలో పదో తరగతి పరీక్షలు రాయనున్న విద్యార్థులకు ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నాం..గత ఏడాది కంటే మంచి ఉత్తీర్ణతా శాతం పెంచేందుకు గణితం తరగతులు విద్యార్థులు అర్థం చేసుకొనే రీతిలో రివిజన్‌ చేస్తాం.. దాదాపు అన్ని సబ్జెక్టులూ రివిజన్‌ చేస్తున్నాం.

➡️