– సిండికేట్ అయిన డెయిరీల యాజమాన్యాలు
– ఒకే సారి ధర రూ.10తగ్గింపు
– అర్థం కాని పరిస్థితిల్లో పాడి రైతులు
– పోషణ భారమైన వేళ రేట్లు తగ్గించడంపై ఆందోళన
– గిట్టుబాటు ధర ఇవ్వాలని రైతుల డిమాండ్
ప్రజాశక్తి-గంగవరం: చిత్తూరు జిల్లాలో పాడి పరిశ్రమపై ఆధారపడిన వారే అధికం. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ అనేక మంది పాడి రైతులు పశుపోషణను జీవనాధారం చేసుకొని బతుకెళ్లదీస్తున్నారు. వ్యవసాయంలో లాభాలు లేక.. సరిపడా ఉపాధి పనులు లేక పాడి ఆవులను కొనుగోలు చేసి పాల ద్వారా వచ్చిన ఆధాయంతోనే జీవిస్తున్నారు. ధరలు పతనం వివిధ డెయిరీ యజమానులు పాడి రైతుల నుంచి గ్రామాల్లో పాలను సేకరిస్తున్నారు. వ్యవసాయంలో పెట్టుబడి కూడా అందని పరిస్థితిల్లో రైతులు పాడిపరిశ్రమ పైనే దృష్టి పెట్టారు. ఎక్కువ మంది పశుపోషణపై ఆధారపడడంతో పాల దిగుబడి అధికంగా పెరిగింది. దీంతో సిండికేట్ అయిన డెయిరీ యజమానులు ఒక్కసారిగా ధరలను తగ్గించేశారు. గతంలో లీటర్‌కు రూ.45చొప్పున చెల్లిస్తుండగా ప్రస్తుతం రూ.10తగ్గించి రూ.35మాత్రమే చెల్లిస్తున్నారు.
కొనుగోలు రేట్లు కుదింపు.. అమ్మకాల ధర రెట్టింపు
పాడి రైతుల నుంచి సేకరిస్తున్న పాలకు డెయిరీ యాజమాన్యాలు లీటరు ధర అత్యల్ప ధరలకు కొనుగోలు చేస్తుండగా.. రెట్టింపు రేట్లుకు మార్కెట్లో విక్రయిస్తుంన్నారని రైతుల నుంచి తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. రైతుల వద్ద నుంచి లీటరుకు సుమారు రూ.35చొప్పున సేకరిస్తుండగా తిరిగి డెయిరీ యాజమాన్యాలు లీటర్ ప్యాకెట్ రూ.60పైగా విక్రయిస్తున్నారు. దీనికి తోడు గ్రామీణ ప్రాంతాల్లో పాల సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అక్కడ అధునాతన పద్ధతిలో పాల క్వాంటిటి, క్వాలిటీని లెక్కిస్తారు. అందులోనూ మోసాలు జరుగుతున్నాయని రైతుల నుంచి అనేక ఆరోపణలు ఉన్నాయి.
పెట్టుబడి, కష్ట్టం జాస్తి..
పాడి రైతులు ఒకొక్క ఆవు సుమారు రూ.70వేల నుంచి రూ.లక్ష పైబడి ధరలకు కొనుగోలు చేస్తున్నారు. వాటికి దాణా ఖర్చులు అంతకంతకూ అధికమైయ్యాయి. అప్పుచేసి పెట్టుబడి పెట్టి కొనుగోలు చేస్తున్న ఆవులను పోషించేందుకు ప్రతి రోజూ కష్టంతో కూడుకున్న పని. తగ్గిన పాల ధరలతో కనీసం కూలీ కూడా గిట్టుబాటు కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి.భారమైన పశుపోషణ పాడి పరిశ్రమనే నమ్ముకొని ఇన్నాళ్లూ కాలం నెట్టుకొస్తున్న పాడిరైతులు ధరలు తగ్గించడంతో గగ్గోలు పెడుతున్నారు. పెరిగిన ధరలతో పశుపోషణ భారమవుతున్న వేళ ధరలు పెంచాల్సింది పోయి యాజమాన్యాలు సిండికేటై ఒక్కసారిగా ధరలు తగ్గించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఉన్న పరిస్థితిల్లోనే పశుపోషణ ఇబ్బందిగా మారిన నేపథ్యంలో ధరలు తగ్గించి ఇబ్బందులకు గురిచేయడం దారుణమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కనీసం కూలీకూడా గిట్టడం లేదు.. : నాగరాజు, రైతు, గంగవరం
మాకు ఆరు ఆవులు ఉన్నాయి. రోజుకు 80నుంచి 100లీటర్లు డిపోలో పాలుపోస్తున్నాను. గతంలో 15 రోజులకోసారి రూ.15వేల నుంచి రూ.20వేల వరకూ బిల్లు వచ్చేది. ప్రస్తుతం రూ.10వేలు మాత్రమే వస్తోం ది. 50కిలోల బుస బస్తా రూ.1300, గానుగ పిండి రూ.1700చొప్పున ధర ఉంది. కనీసం దాణాకు కూడా రాబడి సరిపోవడం లేదు.
ధరలు తగ్గించి నిలువునా ముంచేస్తున్నారు.. : శౌరిరాజు, రైతు, గంగవరం
ఒక్కసారిగా డెయిరీ యజమానులు సిండికేట్ అయి ధరలు తగ్గించేశారు. పాడి రైతులను నిలువునా ముంచేస్తున్నారు. ఈ విధానం సరికాదు. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మినీ డెయిరీ వారి వద్ద చేసిన అప్పు కూడా తీర్చుకోలేని పరిస్థితి. ఇలా అయితే పాడి రైతులు ఎలా బతకాలి.
కష్టం మాకు.. ఆధాయాలు డెయిరీలకా.. కనీసం గిట్టుబాటు ధర కల్పించాలి.
ధరలు తగ్గించడం బాధాకరం : లక్ష్మీ, పాడిరైతు, గంగవరం
ఊళ్లో ఉపాధి పనులు లేకపోవడంతో అప్పు చేసి పాడి ఆవును కొనుగోలు చేసి డెయిరీకి పాలు పోస్తున్నాం. ముందు ఆశించిన మేరా ధరలు ఉండడంతో గిట్టుబాటు ఉండేది. తగ్గించిన ధరలతో పరిస్థితి ఇబ్బందిగా మారింది. కనీసం వడ్డీలు, కూలీ కూడా గిట్టుబాటు కావడం లేదు. ధరలు తగ్గించడం బాధాకరం. ఈ విషయంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలి.