లోకేష్ శంఖారావంతో ప్రజలకు భరోసా

Feb 10,2024 16:34 #Chittoor District
propagation on lokesh sankharavaram

మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి 

ప్రజాశక్తి-వి కోట : రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, వైసీపీ నాయకుల అరాచకాలకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పూరించిన నాదమే శంఖారావం అని మాజీ మంత్రి అమర్నాథరెడ్డి పేర్కొన్నారు. పలమనేరు నియోజకవర్గం వీ.కోట మండలంలోశనివారం వారు ఇంటింటికి తెలుగుదేశం, బాబు షూరిటీ – భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా పర్యటించారు. ఈ సందర్భంగా వీ.కోట పంచాయతీలోని ముదిమడుగు, పట్రపల్లి, వినాయక నగర్, నారాయణ నగర్,భారత్ నగర్, సాయి గార్డెన్లలో ఆయన పర్యటన సాగించారు. ఈ సందర్భంగా మహిళలు కార్యకర్తలు వారికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువగలం పాదయాత్రలో నారా లోకేష్ పర్యటించని నియోజకవర్గాల్లోశంఖారావం కార్యక్రమం తో పర్యటించి జగన్ ప్రభుత్వ దౌర్జన్యాలపై ప్రజలకు కార్యకర్తలకు తెలియజేయనున్నారన్నారు. నిరుద్యోగంతో యువత ఇబ్బందులు పడుతుండగా ధరల పెరుగుదలతో రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రజలకు భరోసా కల్పించేందుకు టిడిపి ప్రతిష్టాత్మకంగా శంఖారావం కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా లోకేష్ బాబు శంఖారావం చేపట్టనున్నారని ఇందులో భాగంగా రానున్న 40- 50 రోజులలో 120 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఈ పర్యటన జరగనుందన్నారు. ఈ కార్యక్రమంతో తెలుగుదేశం పార్టీ చేపట్టబోయే సూపర్ సిక్స్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వారికి చేరువ చేయడం జరుగుతుందన్నారు. ఇప్పటికే యువగలం పాదయాత్ర పేరుతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలలో, పట్టణాలలో సుమారు 220 రోజులపాటు 3132 కిలోమీటర్ల మేర లోకేష్ బాబు దిగ్విజయంగా పాదయాత్ర చేసి ప్రజలకు చేరువయ్యారన్నారు. యువగలం యాత్రను ఉత్తరాంధ్రలో కొనసాగించాలనుకున్న టిడిపి అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుతో అడ్డంకులు ఎదురయ్యాయన్నారు. ఇప్పుడు చేపట్టనున్న ఈ శంఖారావంతో ప్రభుత్వంలో బాధితులుగా మారిన అన్ని వర్గాల ప్రజలకు ఓ వైపు భరోసా కల్పించడమే గాక మరోవైపు కార్యకర్తలకు చేరువకావడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం దిగ్విజయం కావడానికి అన్ని వర్గాల వారు మద్దతు తెలియజేయాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమాలలో నాయకులు రామచంద్ర నాయుడు, రంగనాథ్, రాంబాబు, ఈశ్వర్ గౌడ్, నారాయణస్వామి, పీఎం వెంకట రామప్ప, సోమశేఖర్, రాము, కోదండ, అమర్నాథ్, సతీష్, బాబు, ధీరజ్,హరి,విస్వానాద్, తదితరులు పాల్గొన్నారు.

➡️