ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్ ప్రయత్నాలు
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్ చిత్తూరు ప్రజలు, యువత చిరకాల కోరిక అయిన చిత్తూరులో యూనివర్సిటీ ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ప్రయత్నాలు ఫలితాలు ఇస్తున్నాయి. ఎమ్మెల్యే ఇటీవల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలిసి జిల్లా కేంద్రమైన చిత్తూరులో యూనివర్సిటీ ఏర్పాటు ఆవశ్యకత, ఎన్నికల్లో ఇచ్చిన హామీని గుర్తు చేస్తూ వినతిపత్రం సమర్పించారు. చిత్తూరులో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని, నగరానికి నీటి సరఫరా చేసేందుకు ఉద్దేశించిన అడివిపల్లి రిజర్వాయర్ పైప్‌లైన్ ఏర్పాటు పనులను అమత్ పథకం ద్వారా వేగవంతం చేయించాలని, చిత్తూరులో ఇండిస్టియల్ కారిడార్ ఏర్పాటు చేయాలనే విషయాలను సిఎం దృష్టికి తీసుకెళ్ళారు. ఈ వినతులపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి ఆదేశాలతో సీఎం ముఖ్య కార్యదర్శి పిఎస్ ప్రద్యుమ్న సంబంధిత శాఖల ఉన్నతాధికారులకు లేఖ రాశారు. యూనివర్సిటీ ఏర్పాటు కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి, అడవిపల్లి రిజర్వాయర్ పైప్ లైన్ పనులు వేగవంతం కోసం పురపాలక, పట్టణ అభివద్ధిశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శికి, చిత్తూరు- తచ్చూరు, చెన్నై – బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవేలకు అనుసంధానంగా ఇండిస్టియల్ కారిడార్ ఏర్పాటుకు తగిన చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిని కోరారు. చిత్తూరులో యూనివర్సిటీ ఏర్పాటు చర్యలు వేగవంతం చేయాలని ఎమ్మెల్యే రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ఉన్నతాధికారులను కలిసి విన్నవించారు.