- పంటలు, ఇల్లు ధ్వంసం
ప్రజాశక్తి- పలమనేరు (చిత్తూరు జిల్లా) : చిత్తూరు జిల్లా పలమనేరు రూరల్ మండలంలో ఏనుగు బీభత్సం సృష్టించింది. ఇందిరానగర్ గ్రామ సమీపంలోని పంట పొలాలను నాశనం చేయడంతోపాటు ఓ ఇంటిని ధ్వంసం చేసింది. స్థానికుల వివరాల మేరకు.. చంద్రయ్య అనే రైతు గుడియాత్తం రోడ్డు పక్కన ఉన్న తన వ్యవసాయ పొలానికి సమీపంలోనే ఇంటిని నిర్మించుకుని ఉంటున్నారు. గురువారం తెల్లవారుజామున ఓ ఏనుగు చంద్రయ్య పొలంలోని అరటి, కూరగాయల పంటలను ధ్వంసం చేసింది. అనంతరం పక్కనే ఉన్న ఇంటిపై దాడి చేసింది. భారీ శబ్ధానికి ఇంట్లో ఉన్న వారంతా భయాందోళనకు గురై అక్కడి నుంచి తప్పించుకుని ప్రాణాలను కాపాడుకున్నారు. స్థానికులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం తెలిపారు. అటవీ శాఖ అధికారులు భారీ శబ్దాలు చేస్తూ, బాణా సంచా పేల్చుతూ ఏనుగును అటవీ ప్రాంతంలోకి దారి మళ్లించారు. అనంతరం పంట, ఇంటి నష్టాన్ని పరిశీలించారు. ప్రభుత్వానికి నివేదికను పంపి ఆర్థిక సాయం అందేలా చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ఏనుగులు తరచూ గ్రామాల్లోకి వస్తున్నాయని, పంటలతోపాటు ఆవులు, మేకలు వంటి జీవాలను సైతం తొక్కి చంపేస్తున్నాయని వాపోయారు. ఏనుగులు గ్రామాల్లోకి రాకుండా నివారణ చర్యలు చేపట్టాలని, సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని కోరారు.