హెచ్‌ఐవి లేని సమాజ స్థాపనే లక్ష్యం

Nov 28,2024 22:37
హెచ్‌ఐవి లేని సమాజ స్థాపనే లక్ష్యం

వాల్‌పోస్టర్‌ ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్‌ ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌ ప్రజలు హెచ్‌ఐవి, ఎయిడ్స్‌పై అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ పేర్కొన్నారు. గురువారం జిల్లా సచివాలయంలోని కలెక్టర్‌ ఛాంబర్‌లో డిసెంబర్‌ 1 ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవంను పురస్కరించుకొని అందుకు సంబంధించిన గోడపత్రికలు, బ్యానర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజలు హెచ్‌ఐవి, ఎయిడ్స్‌పై అప్రమత్తంగా ఉండాలన్నారు. హెచ్‌ఐవి అనేది హ్యూమన్‌ ఇమ్యూనో డిఫికెన్సీ వైరస్‌ ద్వారా వస్తుందని, వాడిన సిరంజిలు తిరిగి వాడటం, హెచ్‌ఐవి పాజిటివ్‌ ఉన్నవారి బ్లడ్‌ ఇతరులకు ఎక్కించినప్పుడు, పాజిటివ్‌ ఉన్న తల్లి నుంచి బిడ్డకు సంక్రమిస్తుందని తెలిపారు. హెచ్‌ఐవి వ్యాధిగ్రస్తులతో తిరిగిన, కలిసి భోజనం చేయడం, వారి పనిముట్లు తాకడం వలన హెచ్‌ఐవి రాదని తెలిపారు. 2030 నాటికి హెచ్‌ఐవి లేని సమాజ స్థాపనే మన అందరి లక్ష్యమని, ఆ విధంగా ప్రజలందరికీ అవగాహన కల్పించి సమాజ ఆరోగ్యానికి తోడ్పడాలని తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ ప్రభావతి దేవి, అదనపు వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ వెంకట్‌ ప్రసాద్‌, వ్యాధి నిరోధక టీకాలు అధికారి డాక్టర్‌ హనుమంతరావు, ఆర్‌బిఎస్‌ కే కోఆర్డినేటర్‌ డాక్టర్‌ శిరీష పాల్గొన్నారు.అవగాహన స్టాల్‌ను ప్రారంభించిన డిఎంఅండ్‌హెచ్‌ఒ జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ ఓ.ప్రభావతి దేవి గురువారం గాంధీ విగ్రహం ఎదుట హెచ్‌ఐవి, ఎయిడ్స్‌పై అవగాహన స్టాల్‌ ప్రారంభించారు. నేటి నుంచి ఈ నెల 30వ తేదీ వరకు కళాజాత కార్యక్రమాలు, పాటల కార్యక్రమాలతో హెచ్‌ఐవి ఎయిడ్స్‌పై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. లారీ డ్రైవర్లకు అవగాహన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ ఓ.ప్రభావతి దేవి అపోలో కాలేజ్‌ బృందం గురువారం చిత్తూరు నగర పరిధిలోని మురుకంబట్టు బైపాస్‌ రోడ్డు, సరాయి ఫ్యాక్టరీ ఆపోజిట్‌ లారీ అసోసియేషన్‌లో డ్రైవర్లకు, యువతకు హెచ్‌ఐవి, ఎయిడ్స్‌ పై అవగాహన కల్పించారు.

➡️