మూడడుగుల ఎత్తు.. ముచ్చటైన రూపం

Nov 4,2024 23:43
మూడడుగుల ఎత్తు.. ముచ్చటైన రూపం

– పుంగనూరు పశువు.. ప్రపంచంలోనే ప్రత్యేకం!
– ఆవు గిత్తైనా.. భలే గిరాకీ
– పాలల్లో రుచి, ఔషధ గుణాలు ఎక్కువ
– పోషణ ఖర్చూ తక్కువే అంటున్న రైతులు
– ఎందుకంత ఖరీదు.. ఏంటా లాభాలు..?
– పుంగనూరు ఆవు ప్రత్యేకతపై చదవండి ఈ కథనం
ప్రజాశక్తి- పుంగనూరు: కేవలం మూడడుగులే ఎత్తు.. చూడముచ్చటైన రూపం. కమ్మని ఔషధ గుణాల పాలను ఇస్తుంది.. పోషణ ఖర్చూ తక్కువే. మార్కెట్‌లోనూ భలే గిరాకీ. పెంచి పోషిస్తే లక్షాధికారులు కావడం గ్యారెంటీ.. పుంగనూరు ఆవులో అంత గొప్పదనం ఏంటి.. అన్ని ప్రత్యేకతలేంటో అనుకుంటున్నారా.. అయితే ఈ కథ చదవండి. చిత్తూరు జిల్లాలో పశుపోషణపైనే ఆధారపడిన వారే ఎక్కువ. గేదెల శాతం తక్కువే. ఉన్న పశువుల్లోనూ అధికంగా పుంగనూరు ఆవులే ప్రధాన్యత, ప్రత్యేకమైనవి. దేశ వ్యాప్తంగా ఒంగోలు గిత్తలు, గిరి ఆవులు వంటి పశు జాతుల్లో పుంగనూరు గోవు ప్రపంచంలోనే ప్రత్యేకమైంది. చూడ ముచ్చటైన రూపం.. పొట్టిగ, ముచ్చటైన రూపంతో చూడగానే ఆకర్షిస్తాయి. తొలిసారి చూసిన వారైతే ఆవునా, దూడనా అనే తికమకపడుతుంటారు. ఎందుకంటే ఇవి సాధారణ ఆవు దూడ సైజులో ఉంటాయి. ముడు అడుగుల ఎత్తు (70 నుంచి 90సెంటీ మీటర్లు) ఉంటాయి. 120 నుంచి 200 కిలోల భరువు మాత్రమే ఉంటాయి. చిన్న కొమ్ములు, వెడల్పైన నుదురు, నెల తాకే తోక, ఎక్కువ సంఖ్యలో బూడిద, తెలుపు రంగుల్లో ఉండడం వీటి ప్రత్యేకం.ప్రతికూల పరిస్థితులను తట్టుకుంటాయి.. ప్రతికూల పరిస్థితులను కూడా ఈ ఆవులు తట్టుకోగలవని నిపుణులు చెబుతున్నారు. బాహ్యలక్షణాలే కాకుండా జన్యుపరమైన లక్షణాలు కూడా ఈ జాతిని నిర్ధారిస్తాయంటున్నారు. ఈ జాతి ఆవులు ఎంతటి ఎండనైనా, ఎలాంటి చలినైనా తట్టుకుని జీవించగలవు. సాధారణ ఆవులకు, పుంగనూరు ఆవులకు.. చాలా వ్యత్యాసం ఉంటుంది. పుంగనూరు ఆవులకు.. వాసన పసిగట్టే సామర్థ్యం ఉంది. ఈ సామర్థ్యంతో ఎక్కడికి వెళ్లినా కూడా తిరిగి అదే మార్గంలో వెనక్కి వచ్చేయగలగడం వీటి ప్రత్యేకత. పాలల్లో ఔషధ గుణాలు పుంగనూరు ఆవు పాలలో ఔషధ గుణాలు ఉంటాయని స్థానిక రైతులు, నిపుణులు చెబుతున్న మాట. ఈ పాలు చాలా రుచిగా ఉంటాయి. మామూలు ఆవు పాలలో 3.5 శాతం వెన్న ఉంటే ఈ ఆవు పాలలో 6 నుంచి 8 శాతం వెన్న ఉంటుంది. ఈ పాలు సుగంధ వాసనలతో, ఆయుర్వేద గుణాలతో ఉంటాయి. ఈ పాలలో కొవ్వు పదార్థాలు తక్కువగా ఉంటాయని స్థానిక రైతులంటున్నారు.పోషణ ఖర్చూ తక్కువే.. వీటికి జబ్బులను తట్టుకునే గుణం ఎక్కువగా ఉండడంతో పాటు తక్కువ మేత మేస్తాయని రైతులుంటున్నారు. వీటిని తక్కువ ఖర్చుతో పెంచవచ్చు. ఎలాంటి ప్రతికూల పరిస్థితులనైనా తట్టుకునే గుణం వీటిలో అధికంగా ఉందని పాడి రైతులు చెబుతున్నారు.ఇంట్లో ఉంటే మంచిదనే సెంటిమెంట్‌.. పుంగనూరు ఆవు ఇంట్లో ఉంటే మంచిదన్న సెంటిమెంటుతో కూడా కొందరు ఇప్పుడు ఈ ఆవులను పెంచుతున్నారు. తిరుమల వెంకటేశ్వర స్వామి అభిషేకంలో కూడా ఈ పాలను వాడుతున్నారు. దేశవాళి జాతితో పోలిస్తే సంకరజాతి పశువుల్లో పాల దిగుబడి ఎక్కువగా ఉండడం వల్ల వాటివైపు మొగ్గుచూపుతున్నారు. దీంతో, క్రమేపి దేశవాళి ఆవులు అంతరించి పోతున్నాయి. అందులో ప్రధానమైనది పుంగనూరు జాతి ఆవు. దీన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని రైతులంటున్నారు.భలే గిరాకీ.. ప్రపంచ దేశాల్లో అనేక రకాల ఆవులు ఉన్నప్పటికీ.. పుంగనూరు ఆవులకు ఉన్నంత గిరాకీ.. మరే ఆవులకూ లేదంటారు. సాధారణ ఆవుల మాదిరిగా కాకుండా ఈ ఆవులు కేవలం మూడు అడుగుల పొడవు ఉండి.. ముద్దుగా, ఆకర్షణీయంగా ఉంటాయి. పుంగనూరు ఆవులకు ఎంత డిమాండ్‌ ఉందంటే.. 2007లో వీటి ధర కేవలం వేలల్లో పలికేది. కానీ ప్రస్తుతం వీటి ధర మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకూ పలుకుతోంది. పుంగనూరు ఆవుతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పోస్టల్‌ స్టాంపును కూడా విడుదల చేసింది.

➡️