మెప్మా అర్బన్ మార్కెట్‌లతో నాణ్యమైన వస్తువులు
పొదుపు సంఘాల బలోపేతానికి ప్రభుత్వం తోడ్పాటు
మార్కెట్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి
ప్రజాశక్తి-పలమనేరు: మహిళలు ఆర్థిక స్వాలంబన సాధించాలని పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డి అన్నారు. బుధవారం పలమనేరు పురపాలక సంఘ కార్యాలయ ఆవరణలో మెప్మా ఆధ్వర్యంలో జరిగిన మెప్మా అర్బన్ మార్కెట్ ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. ఈ సందర్భంగా మహిళా సంఘ సభ్యులనుద్దేశించి ఆయన ప్రసంగించారు. మహిళా సంఘ సభ్యులు తయారు చేసే ఉత్పత్తులను మార్కెటింగ్ సౌకర్యం, విక్రయించే అవకాశం కల్పించేందుకు ప్రభుత్వం మెప్మా బజార్లను నిర్వహిస్తోందన్నారు. పొదుపు సంఘాలకు బ్యాంకు రుణాలను ఇప్పించడమే కాకుండా వారు ఇతరులపై ఆధారపడకుండా ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఇందులో భాగంగానే మహిళ అర్బన్ మార్కెట్లను ఏర్పాటు చేసి నాణ్యమైన వస్తువులను అందుబాటులోకి తేవడం, మార్కెటింగ్ సదుపాయం కల్పించడంతో పాటు విక్రయించే అవకాశాన్ని కూడా కల్పించడం జరుగుతుందన్నారు. చేతి వత్తులు కుటీర పరిశ్రమల ద్వారా తయారు చేసే ఉత్పత్తులను పట్టణవాసులు కొనుగోలు చేసి వారిని ప్రోత్సహించాలని సూచించారు. పొదుపు సంఘాల బలోపేతానికి ప్రభుత్వం తోడ్పాటునందిస్తోందని మహిళలు మగవాళ్ళకు ధీటుగా ఆర్థిక అభివద్ధి సాధించాలని సూచించారు. అనంతరం మహిళా సంఘాల సభ్యులు తయారు చేసిన ఉత్పత్తులను ఆయన పరిశీలించారు. తదనంతరం మున్సిపల్ పారిశుధ్య కార్మికులను ఆయన సన్మానించారు. కార్యక్రమాలలో మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి, మెప్మా సీఎంఎం వి.బాబా, సీఈవోలు జయంతి, ధనలక్ష్మి, ఎస్‌ఎల్‌ఎఫ్, ఆర్పీలు, బాలాజీ కో-ఆపరేటివ్ సూపర్ బజార్ అధ్యక్షులు ఆర్.వి.బాలాజీ, నాయకులు కుట్టి, గిరి, సుబ్రహ్మణ్యం గౌడు, నాగరాజు, ఖాజా, కిరణ్, బిఆర్‌సి కుమార్ తదితరులు పాల్గొన్నారు.