త్వరలో జనసేన పార్టీలో చేరిక
ప్రజాశక్తి-పలమనేరు : చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన కాపు సంఘం నేత, వైసిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆకుల గజేంద్ర ప్రసాద్ వైసీపీకి రాజీనామా చేసి త్వరలో జనసేన పార్టీలో చేరుతున్నట్లు నిన్న రాత్రి జరిగిన మీడియా సమావేశంలో ప్రకటించారు. రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల న ఫలితాల్లో వైసీపీ ఘోరంగా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో పార్టీకి కొంతమంది సీనియర్ నేతలు రాజీనామా చేసి ఇతర పార్టీల్లోకి చేరిపోగా, మరి కొంతమంది నేతలు స్తబ్ధుగా ఉండిపోయిన విషయం విధితమే. తాజాగా బుధవారం పలమనేరు నియోజకవర్గ నేత, రాష్ట్ర వైసీపీ సంయుక్త కార్యదర్శి ఆకుల గజేంద్ర ప్రసాద్ ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పదవికి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు.
ఆయన మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన అనుచరులుగా అప్పట్లో రాష్ట్ర స్థాయిలో బాగా గుర్తింపు పొందారు. రాజీనామా చేసిన ఆయన మాట్లాడుతూ… త్వరలో జనసేన పార్టీలోకి వెళుతున్నట్లు స్పష్టం చేశారు. వైసీపీ నందు సంవత్సరాల తరబడి సేవచేసినా,b కొన్ని దుష్ట శక్తుల వలన పార్టీ ఎటువంటి గుర్తింపు ఇవ్వలేదని ఆవేదన చెందారు. పార్టీలోకి ఎంత నిజాయితీగా వచ్చానో అంతే నిజాయితీగా బయటకు వచ్చానని, ఎటువంటి అక్రమాలకు పాల్పడలేదని అన్నారు. జనసేన అధినేత, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆలోచనలకు తన ఆలోచనలకు దగ్గరగా ఉండని అందుకే జనసేనలోకి వెళ్తున్నట్లు తెలిపారు. అన్నీ అనుకూలిస్తే ఈనెల చివర్లో పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలోకి చేరుతున్నట్లు ఆయన తెలిపారు.