ప్రజాశక్తి – చిత్తూరు : చిత్తూరు జిల్లాలో మామిడి పంట సాగు విస్తీర్ణం పెరిగిందని, ఉత్పాదకత పెంచాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖల డైరెక్టర్ కె. శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం చిత్తూరు పట్టణం లోని ఎన్ పి సి పెవిలియన్ నందు మామిడి రైతులు, కొనుగోలుదారులతో నిర్వహించిన ఉద్యాన పంటల సదస్సు కార్యక్రమానికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖల డైరెక్టర్,జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులతో పాటు చిత్తూరు నగర మేయర్ అముద, పూతలపట్టు శాసనసభ్యులు కె.మురళీ మోహన్, చుడా చైర్ పర్సన్ కఠారి హేమలత తదితరులు కార్యక్రమం లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ ను అతిథులు ప్రారంభం చేసి సందర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖల డైరెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అవసరమైన మేర మామిడి పంట విస్తీర్ణం జరిగిందని, ఉత్పాదకత పెంచాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో ఒక హెక్టార్ కు 12 మెట్రిక్ టన్నులు ఉండగా, దేశంలోని గుజరాత్ లాంటి రాష్ట్రాలలో ఒక హెక్టార్ కు 15 వేల మెట్రిక్ టన్నులు ఉత్పాదకత ఉన్నదని, ప్రపంచ వ్యాప్తంగా చూస్తే మన దేశంలో ఒక హెక్టార్ కు సుమారు 9 మెట్రిక్ టన్నులు ఉండగా బ్రెజిల్ లాంటి దేశాలలో 20 నుండి 25 మెట్రిక్ టన్నులు ఉత్పాదకత ఉన్నదన్నారు. మామిడి పంటతో పాటు ఇతర ఉద్యాన పంటల ఉత్పాదకత, మార్కెటింగ్, ప్రొసెసింగ్, గిట్టుబాటు ధరల పై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. ఆర్థిక ఇబ్బందులున్న నేపథ్యంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యాన పంటల సాగుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని, గత 6 నుండి 7 నెలల కాలంలో లక్ష హెక్టార్లకు మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు అమలు చేశామని, దేశ స్థాయిలో గత సంవత్సర కాలంలో 1.12 లక్షల హెక్టార్లకు మైక్రో ఇరిగేషన్ అమలు చేసి దేశంలో ప్రథమ స్థానంలో నిలిచామన్నారు. ఉత్పాదకత లేని మామిడి తోటలను తిరిగి పునరుజ్జీవం చేసేలా, పంట తెగులు నివారణ పై శాస్త్రజ్ఞులతో పరిశోధనలు చేయిస్తున్నామని, బయో లిక్విడ్ వాడకం ద్వారా భూసారం పెంచగలిగితే ఉత్పాదకత పెరిగే పరిస్థితి ఉందని, తద్వారా గతంలో రూ. 5వేల వరకు ఆదాయం పొందే రైతు రూ.30వేల వరకు ఆదాయం చూడొచ్చన్నారు. మామిడి పంట ఉత్పాదకత తో పాటు మార్కెటింగ్, ప్రొసెసింగ్, ప్రకృతి విపత్తు సమయంలో రైతులను ఆదుకోవడం పై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. మొదటిసారిగా మామిడి పంటకు ఇన్స్యూరెన్స్ చేయడం జరుగుతున్నదని, 20 వేల మంది రైతుల ద్వారా ఇన్సూరెన్స్ కార్యక్రమం చేశామన్నారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ఉత్పత్తి పరంగా, నాణ్యతా పరంగా చిత్తూరు జిల్లా మామిడికి చాలా ప్రాధాన్యత ఉన్నదని, రాష్ట్ర ప్రభుత్వం మామిడి రైతులకు అండగా ఉంటుందని తెలిపారు. జిల్లాలో దాదాపు 75 వేల మంది రైతులు మామిడి పంటపై ప్రధానంగా ఆధారపడి ఉన్నారని, దాదాపు 90 వేల హెక్టార్లలో ఉద్యాన పంటలు ఉండగా అందులో 70 వేల హెక్టార్ల వరకు మామిడి పంట ఉందని తెలిపారు. గత 10 సంవత్సరాల కాలంలో చెరకు, వేరుశనగ రైతులు మామిడి పై అధిక దృష్టి సారించడంతో మామిడి పంట సాగు విస్తీర్ణం పెరిగిందని, ఎం జి ఎన్ ఆర్ ఈ జి ఎస్ కింద పంట విస్తీర్ణం పెంచడానికి సహకారం అందించామన్నారు. ప్రతి సంవత్సరం 10 నుండి 15 శాతం మామిడి పంట సాగు విస్తీర్ణo పెరుగుదల ను గుర్తించడం జరిగిందన్నారు. ఉత్పాదక, మార్కెటింగ్, గిట్టుబాటు ధర, ప్రాసెసింగ్ అంశాలలో మెరుగుపడాల్సిన అవసరం ఉందన్నారు. మామిడి సీజన్ కు ముందు, సీజన్ సమయంలో తీసుకోవలసిన మెళకువలు, ప్రభుత్వ ఋణాలు, సబ్సిడీ వివరాలు వివరించడం జరుగుతుందన్నారు. గత 9 నెలల కాలంలో చిత్తూరు జిల్లాకు 10 వేల మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు లు మంజూరు చేసిందని, ఆర్ కె వి వై, ఎం ఐ డి హెచ్ కింద రాష్ట్రంలో అత్యధికంగా జిల్లాకు రూ.20 కోట్లు సహాయం అందించడం జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం రూ.25 కోట్లతో మామిడి పంట విస్తరణ, క్లస్టర్ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపట్టనున్నామన్నారు. చిత్తూరు మామిడి ఉత్పత్తి పరంగా, నాణ్యతా పరంగా మెరుగ్గా ఉన్నందున ఇతర రాష్ట్రాల నుండి దేశాల నుండి కొనుగోలుదారులు చిత్తూరు మామిడి పై పెట్టుబడికి ముందుకు వస్తున్నారని, ఇది శుభపరిణామం అన్నారు. చిత్తూరు ఉద్యాన పంటల పెంపకం సదస్సు ద్వారా మామిడి రైతులకు, కొనుగోలుదారులకు మరింత అవగాహన పెంచగలమని ఆశిస్తున్నామన్నారు.
జెడ్పి ఛైర్మన్ మాట్లాడుతూ జిల్లాలో రైతులు అధికంగా మామిడి పంట పై ఆధారపడి జీవిస్తున్నారని, మామిడి పంట, ఇతర పంటలను విక్రయించడానికి తగిన మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని తెలిపారు. మామిడి రైతులకు ప్రభుత్వం గిట్టుబాటు ధరలు కల్పించేలా చర్యలు చేపట్టాలని కోరారు.
పూతలపట్టు ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మామిడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సాహసోపేతంగా ఒక సదస్సును ఏర్పాటు చేసి పరిష్కార మార్గం చూపాలని భావించిందని తెలిపారు. వ్యవసాయం లాభసాటిగా సాగాలని, రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలని, ఆర్థికంగా ఎదగాలన్న ఉద్దేశ్యంతో గత కొన్ని సంవత్సరాలుగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్నారు. ఎంజిఎన్ ఆర్ ఈ జి ఎస్ పథకం ద్వారా ఉచితంగా మామిడి మొక్కల పంపిణీ, నీటి సౌకర్యం కల్పించడం ద్వారా మామిడి పంట సాగు విస్తీర్ణం జిల్లాలో పెరిగిందన్నారు. తిరుమలకు వచ్చే భక్తులకు క్యూ లైన్ లో, నడకదారిలో ఉచితంగా అందిస్తున్న ఆహారం, పాలు, మజ్జిగతో పాటు మామిడి జ్యూస్ ను కూడా అందించే విధంగా చర్యలు తీసుకోవాలని, మ్యాంగో బోర్డు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రిని అసెంబ్లీ వేదికగా కోరడం జరిగిందని, ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందిస్తారన్న నమ్మకం ఉందన్నారు. దేశం లోనే మొదటిసారి ఇజ్రాయెల్ టెక్నాలజీని రాష్ట్రంలోని కుప్పంలో ప్రవేశపెట్టి ప్రపంచమంతా చిత్తూరు జిల్లా వైపు చూసేలా చేసిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు దక్కుతుందన్నారు. వ్యవసాయం దశ దిశ మార్చే శక్తి ముఖ్యమంత్రికి ఉందని తెలిపారు. మామిడి పంట పై వివిధ విశ్వవిద్యాలయాలో పరిశోధనలు జరుగుతున్నాయని, రైతులు శాస్త్రజ్ఞులు అందించిన సూచనలను పాటిస్తే మెరుగైన ఫలితాలను అందుకుంటారన్నారు. గ్రామ సచివాలయం స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు వ్యవసాయ అధికారులు రైతులకు సహాయం చేయడానికి అందుబాటులో ఉంటారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మామిడి రైతులకు, కొనుదారులకు, ప్రొసెసింగ్ యూనిట్ల యాజమానులతో అవగాహన సదస్సు ఏర్పాటు చేసిందని, ఈ సదస్సు ద్వారా మెరుగైన ఫలితాలను ఆశిస్తున్నానన్నారు. జీవనదులు లేని, బోర్ నీటి పై లేక వర్షాల పై ఆధారపడి పంట పండిస్తున్న పరిస్థితుల్లో డ్రిప్ ఇరిగేషన్ ను ప్రవేశపెట్టి దేశంలో మొదటి స్థానం లో రాష్ట్రాన్ని నిలిపారన్నారు.
ఈ కార్యక్రమంలో ఉద్యాన శాఖ అదనపు సంచాలకులు హరినాథ్ రెడ్డి, ప్రాజెక్ట్ డైరెక్టర్ మైక్రో ఇరిగేషన్ వెంకటేశ్వర్లు,ఉద్యాన శాఖ జాయింట్ డైరెక్టర్ దేవ ముని రెడ్డి,మాజీ ఎమ్మెల్సీ దొరబాబు,జిల్లా ఉద్యాన, వ్యవసాయ, ఏ పి ఎం ఐ పి, పట్టు పరిశ్రమ శాఖ ల అధికారులు మధు సూదన్ రెడ్డి, మురళీ కృష్ణ, బాల సుబ్రమణ్యం, శోభారాణి, సైంటిస్ట్ లు సంబంధిత అధికారులు, పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు..