ప్రజాశక్తి – కొమరాడ : కమ్యూనిటీ హెల్త్ వర్కర్లకు ఉపాధి పనులైనా కల్పించండి లేదా నెలకు రూ.15 వేలు వేతనమైన ఇవ్వాలని సిఐటియు నాయకులు కొల్లి సాంబమూర్తి డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి ఎంపిడిఒ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం ధర్నా చేపట్టారు. ఈ నిరసనను ఉద్దేశించి సిఐటియు నాయకులు కొల్లి సాంబమూర్తి, కమ్యూనిటీ హెల్త్ వర్కర్ల నాయకులు అనసూయమ్మ, రాధ, లక్ష్మి, దుర్గ మాట్లాడుతూ మండలంలోని కొమరాడ, మాదలింగి, రామభద్రపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సుమారు 110 మంది వరకు కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు పనిచేస్తున్నామని, తమకు కనీసం వేతనం ఇవ్వడంలేదన్నారు. నెలకు ఇస్తున్న రూ.4వేలు కూడా సక్రమంగా నెల నెలా ఇచ్చే పరిస్థితి లేదన్నారు. ప్రతిరోజూ కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు ఉదయం 9 గంటల నుండి రాత్రి వరకు పనిచేసే పరిస్థితి ఉందన్నారు. గ్రామాల్లో గర్భిణులకు, ఎవరికైనా ఏం జరిగినా పూర్తి బాధ్యత కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు అంటూ వీరిపై అధికారులు విరుచుకు పడే పరిస్థితి ఉందని తెలిపారు. పని భారం పెరిగిందని, ఉద్యోగ భద్రత లేదని, రాజకీయ వేధింపులు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో నెలకు కనీసం రూ.15వేలైనా ఇవ్వాలని, లేకుంటే ఉపాధి పనులైనా కల్పించి అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు. ఈ ఆందోళనలో అధిక సంఖ్యలో కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు పాల్గొన్నారు.
