ప్రజాశక్తి – మండపేట : ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రమాదాలను నివారించాలని మండపేట రూరల్ సీఐ పి.దొరరాజు అన్నారు. అందరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ భారతదేశాన్ని సేఫ్ ఇండియగా మార్చాలనే సంకల్పంతో మండలంలోని తాపేశ్వరంలో శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులు గురువారం ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీఐ పాల్గొన్నారు. ఈ ర్యాలీని దొరరాజు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, హెల్మెట్ ధరించడం, సీటు బెల్టు పెట్టుకోవడం, సిగ్నల్ రూల్స్ పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చన్నారు. ప్రతి నెల నిర్వహించే స్మార్ట్ లివింగ్ ప్రోగ్రాం లో భాగంగా ఈనెల సేఫ్ ఇండియా అనే ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం నిర్వహించిన విద్యార్థులను ఆయన అభినందించారు. విద్యార్థుల ద్వారా ప్రజలకు ట్రాఫిక్ పై అవగాహన తెలియజేయడం మంచి ప్రయత్నం అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు వాహనదారులకు పలు నిబంధనలను, సూచనలను, నినాదాలు ద్వారా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపల్ లక్ష్మీనారాయణ, రాయవరం ఎస్సై బుచ్చిబాబు, స్కూల్ విద్యార్థిని, విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.