అనంతపురం : జిల్లా ఎస్పీ పి.జగదీష్ ఆదేశాల మేరకు నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు పకడ్బందీ చర్యలు చేపట్టినట్లు ట్రాఫిక్ సీఐ కె.రఘుప్రసాద్ తెలిపారు. మంగళవారం ఆయన ప్రజాశక్తితో మాట్లాడుతూ … స్థానిక రుద్రంపేట బైపాస్ లో ఉదయం 8 నుంచి 9 వరకు, సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు ట్రాఫిక్ అధికంగా ఉంటుందన్నారు. ఇందుకు జిల్లా ఎస్పీ ద్వారా ఎన్‌హెచ్‌ఏఐ అధికాలతో చర్చించి కళ్యాణదుర్గం బైపాస్ సమీపంలోని మసీదు వద్ద జాతీయ రహదారికి ఉన్న ఫెన్సింగ్ ను తీసి అక్కడ బీటీ రోడ్డు వేయించి సర్వీసు రోడ్డులోకి వాహనాలు మళ్లించి ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. జాతీయ రహదారిపై నుంచి సర్వీసు రోడ్డులోకి వాహనాలు వచ్చే సమయంలో ప్రమాదాలు జరగకుండా స్పీడ్ బ్రేకర్లు వేయడంతో పాటు ఉదయం 7.30 నుంచి రాత్రి 9 గంటల వరకు ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా షిఫ్ట్ పద్ధతిలో ఇద్దరు కానిస్టేబుళ్లను నియమించామన్నారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట రోగులు, వఅద్ధులు రోడ్డు దాటుతూ ప్రమాదాలకు గురై మంచాలకే పరిమితమవుతున్నారని దీనిని నివారించేందుకు ఆరు ఇనుప ఫెన్సింగ్ లను ఏర్పాటు చేశామన్నారు. తాడిపత్రి బస్టాండ్ లో డీజిల్ ఆటోలు నిలుపుతున్న కారణంగా ట్రాఫిక్ కి ఇబ్బంది కలుగుతూండటంతో దాదాపు 45 నుంచి 50 డివైడర్ లను ఏర్పాటు చేసి ఆటోలు ఒక వైపు, ఆర్టీసీ బస్సులు మరోవైపు నిలిపి ట్రాఫిక్ సాఫీగా సాగేలా చర్యలు తీసుకున్నామన్నారు. దీనికి తోడు తాడిపత్రి బస్టాండ్ లోనూ, నగరంలో 4, 5 చోట్ల మల్టీ లెవెల్ పార్కింగ్, 2, 3 చోట్ల పెయిడ్ పార్కింగ్ ప్రదేశాలను ఎంపిక చేసి కార్పొరేషన్ అధికారులతో కలిసి పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతిరోజూ 4 గంటల పాటు డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ నిర్వహిస్తూ రోజుకు కనీసం 10 కేసులు నమోదు చేస్తున్నామని చెప్పారు. ప్రతిరోజూ సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు విజిబుల్ పోలీసింగ్ నిర్వహిస్తూ సరైన ధఅవపత్రాలు, హెల్మెట్, త్రిబుల్ రైడింగ్ లపై రోజుకు 125 చలానాలు విధిస్తున్నామన్నారు.
ప్రజలు సహకరించాలి – పోలీసులు ఎంత పకడ్బందీగా విధులు నిర్వహించినా ట్రాఫిక్ నియంత్రణకు ప్రజలు సహకరించాలని సీఐ కోరారు. ప్రధానంగా రాంగ్ రూట్ లో వస్తున్న కారణంగా ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పారు. ప్రజలు ట్రాఫిక్ సూచనలు పాటించి పోలీసులకు సహకరించాలని కోరారు.