సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి : సిఐ

ప్రజాశక్తి- యర్రగొండపాలెం : విద్యార్థులు సైబర్‌ నేరాల పట్ట అప్రమత్తంగా ఉండాలని సిఐ సిహెచ్‌. ప్రభాకర్‌రావు తెలిపారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సైబర్‌ నేరాల నియంత్రణపై అవగాహన కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో సెల్‌ఫోన్‌ వినియోగం పెరిగిపోయిందన్నారు. ప్రతినిమిషం సెల్‌ ఫోన్‌ లేనిది ఏ పని చేయలేకపోతున్నారని తెలిపారు. బ్యాంక్‌ ఖాతా, పాన్‌ కార్డ్‌, ఆధార్‌ కార్డు, పెన్షనుకు సెల్‌ నంబర్‌ అవసరంగా మారిందన్నారు. దాన్ని ఆసరాగా చేసుకుని సైబర్‌ నేరగాళ్లు ప్రజలకు ఏదో ఒక ఆశ చూపి సైబర్‌ నేరాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. సైబర్‌ నేరాలు, ర్యాగింగ్‌,మత్తు పదార్థాలు పట్ల యువత, విద్యార్థులు పూర్తి అవగాహన కలిగి ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్‌ చేసి ఎటిఎం ఫిన్‌ నంబర్‌, సివివి నంబరు, బ్యాంకు ఖాతా వివరాలు అడితే చెప్పరాదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ పి.చౌడయ్య, ప్రధానోపాధ్యాయురాలు కె. రమాదేవి, ఉపాధ్యాయులు, పోలీస్‌ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. కంభం రూరల్‌ : సైబర్‌ నేరాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని ఎస్‌ఐ నరసింహారావు తెలిపారు. స్థానిక వాసవీ సంస్థల విద్యార్థులకు సైబర్‌ నేరాలు, మద్యపానం, మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్ప్రయోజనాలు, మహిళలపై జరుగుతున్న అత్యాచారాల నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ విద్యార్థులు సైబర్‌ నేరాలు, మద్యపానం, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. క్రమ శిక్షణతో చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వాసవీ విద్యాసంస్థల ప్రిన్సిపల్‌, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

➡️