ఆదుకుంటానని చెప్పి, అక్రమ అరెస్టులకు పాల్పడడం సిగ్గుచేటు : సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి బి.మల్లికార్జున

రాయదుర్గం (అనంతపురం) : ఎన్నికలకు ముందు తమ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే అంగన్వాడీలు ఏదైతే 26 వేల రూపాయల వేతనం పెంచాలని అడుగుతున్నారో ఆ వేతనం పెంచే బాధ్యత తమ కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పిన ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఇందుకు విరుద్ధంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని చలో విజయవాడ కార్యక్రమానికి నిన్న బయలుదేరిన అంగన్వాడి వర్కర్లను రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ అరెస్టులు చేయడం, అక్రమ నిర్బంధాలు చేపట్టడం, హౌస్‌ అరెస్ట్‌ చేయడం దేనికి సంకేతమో రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని సిఐటియు అనంతపురం జిల్లా సహాయ కార్యదర్శి బి మల్లికార్జున డిమాండ్‌ చేశారు. సోమవారం అంగన్వాడీల అక్రమ అరెస్టులకు నిరసనగా రాయదుర్గం ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడి వర్కర్లతో కలిసి రాయదుర్గం తహసిల్దార్‌ కార్యాలయం వద్ద దాదాపు గంట పాటు బైఠాయించారు. వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి మల్లికార్జున మాట్లాడుతూ, జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం అంగన్వాడీలను తీవ్రంగా క్షోభకు గురిచేసిందని తమ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అంగన్వాడీల సమస్యలన్నింటిని పరిష్కరిస్తామని చెప్పి, అధికారంలోకి రాగానే అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కుతూ, వారి హక్కులను అడగడం కోసం విజయవాడకు వస్తే అక్రమ అరెస్టులు, నిర్బంధాలు, హౌస్‌ అరెస్టులు చేయించడంలో ఇక జగన్‌ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి తేడా ఏముందని ప్రశ్నించారు. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని తహసిల్దార్‌ కార్యాలయాల వద్ద ధర్నా కార్యక్రమాలు చేపట్టాలని యూనియన్‌ పిలుపు ఇస్తే ప్రభుత్వం మాత్రం సెక్టర్‌ మీటింగులు పెట్టుకో మంటూ ధర్నా కార్యక్రమాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేయడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పందించి అంగన్వాడి వర్కర్లకు కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని, గ్రాట్యూటీని అమలు చేయాలని, మినీ సెంటర్లను మెయిన్‌ సెంటర్‌ లుగా మార్చాలని, హెల్పర్లకు ప్రమోషన్లు కల్పించాలని, సంక్షేమ పథకాలను అంగన్వాడి వర్కర్లకు కూడా అమలు చేయాలని, సాధికారత సర్వేలో ప్రభుత్వ ఉద్యోగులు అనే పదాన్ని తొలగించాలని, అన్ని యాప్‌ లను కలిపి ఒకే యాప్‌ గా చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం స్పందించి పై సమస్యలపై సమరస్యంగా యూనియన్‌ నాయకత్వంతో చర్చించి సమస్యల పరిష్కారానికి చోరవ చూపాలని లేనిపక్షంలో ఈ ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరింపజేసి అంగన్వాడి వర్కర్ల సమస్యలు పరిష్కరించే వరకు రాజీలేని పోరాటాలను నిర్వహించేందుకు సంసిద్ధం కావాల్సి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తమ డిమాండ్తో కూడిన వినతిపత్రాన్ని రాయదుర్గం తహసిల్దార్‌ నాగరాజుకు అందజేశారు. అంగన్వాడి వర్కర్లు చేస్తున్న ధర్నాకు సిపిఎం సీనియర్‌ నాయకులు ఎన్‌ నాగరాజు, రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు ఎం మల్లికార్జున తమ సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ కార్యదర్శి మేరీ, సెక్టర్‌ లీడర్లు చంద్రకళ, కఅష్ణవేణి, మెహ్రూన్‌, రుద్రమ్మ, మల్లక్క, రాధిక, శోభ, ఉల్లిగమ్మ, అనురాధ, రుద్రమ్మ, రూప, లలిత మరియు రాయదుర్గం ఐసిడిఎస్‌ ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడి వర్కర్లు పాల్గొన్నారు.

➡️