కార్మిక వర్గానికి అండ.. సిఐటియు జెండా

Citu office opening at Padmanabham

 ప్రజాశక్తి – పద్మనాభం కార్మికవర్గానికి, బడుగు, బలహీన తరగతులకు గొప్ప అండ.. సిఐటియు జెండా అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాథం అన్నారు. పద్మనాభం మండల కేంద్రంలో సిఐటియు మండల కార్యాలయాన్ని ఆదివారం ఉత్సాహపూరిత వాతావరణం నడుమ ఆయన ప్రారంభించారు. అనంతరం అక్కడ జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ఇటువంటి మారుమూల మండలాల్లో సిఐటియు కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం ఎంతో ఆనందదాయకమని, మండలంలో పనిచేస్తున్న స్కీం వర్కర్లకు, కార్మికులకు ఇది ఎంతగానో అండగా నిలుస్తుందని అన్నారు. నేటి కాలంలో కొన్ని పార్టీల జెండాలు ఎన్నికల సమయంలో గ్రామాల్లో రెపరెపలాడి ఎన్నికలు ముగిసిన తరువాత ఎక్కడా కనిపించడం లేదన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి పనిచేసేది ఒక్క ఎర్రజెండా మాత్రమేనన్నారు. పాలకులు నిత్యావసర ధరలను అదుపు చేయడంలో విఫలమయ్యారన్నారు. ఎన్నికల్లో విద్యుత్‌ బిల్లులు పెంచబోమని చెప్పిన చంద్రబాబు నేడు కరెంట్‌ బిల్లుల భారాన్ని జనంపై మోపుతున్నారన్నారు. రూ.6 వేల కోట్లను సర్దుబాటు ఛార్జీల పేరిట ప్రజలపై వేస్తున్నారని తెలిపారు. ప్రజల జీవితాల్లో మార్పు రావాలంటే నేటి పాలకులు మారాలన్నారు. ప్రత్యామ్నాయ విధానాలతో వచ్చేవారిని ప్రజలు ఆదరించాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో ఒక పార్టీ లడ్డూను చూపించి రాజకీయం చేస్తోందని, మరో పార్టీ ఆస్తులు విషయాల్లో తలమునకలై ఉందని అన్నారు. ఇలా పూర్తిగా వారివారి స్వప్రయోజనాల కోసమే పాకులాడుతున్నాయని విమర్శించారు. కార్మికులకు పనికి తగ్గ వేతనం దక్కడం లేదని తెలిపారు. భీమిలి నియోజకవర్గంలో అతి పెద్ద పరిశ్రమగా ఉన్న చిట్టివలస జ్యూట్‌ మిల్లును పూర్తిగా పాలకులు నాశనం చేశారన్నారు. దీనివల్ల ఎంతో మంది ఉపాధి కోల్పోయి అనేక రంగాలలో తక్కువ జీతానికి పనిచేస్తున్నారన్నారు. ప్రభుత్వాలు ప్రజా సంక్షేమంలో విఫలమయ్యాయన్నారు. సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు మాట్లాడుతూ ఇప్పటికే పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపుతో జనం అల్లాడుతున్నారని, వారిపై నేడు విద్యుత్‌ భారాలు మోపేందుకు కూటమి ప్రభుత్వం పూనుకుందని అన్నారు. దీంతో సామాన్యుల బతుకులు మరింత భారంగా మారనున్నాయని తెలిపారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌కెఎస్‌వి.కుమార్‌ మాట్లాడుతూ చిట్టివలస జ్యూట్‌ మిల్లు మూసివేతతో పద్మనాభం, భీమిలి, ఆనందపురం మండలాల కార్మికులు పెద్ద సంఖ్యలో ఉపాధి కోల్పోయారని తెలిపారు. ప్రభుత్వాలు సామాన్యులకు ఉపాధి చూపే బాధ్యత నుంచి తప్పుకున్నాయని విమర్శించారు. సిపిఎం 78వ వార్డు కార్పొరేటర్‌ డాక్టర్‌ బి.గంగారావు మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి ఉద్యమాలే శరణ్యమన్నారు. సిఐటియు భీమిలి డివిజన్‌ కార్యదర్శి ఆర్‌ఎస్‌ఎన్‌.మూర్తి మాట్లాడుతూ ఉద్యమాలకు పద్మనాభం సిఐటియు కార్యాలయం ప్రధాన కేంద్రంగా నిలువనుందని తెలిపారు. కార్యక్రమంలో ఐద్వా నాయకులు నాగరాణి, సిఐటియు నాయకులు రవ్వ నర్సింగరావు, రాజ్‌కుమార్‌, ఎం.అప్పారావు, రాము, ఆదినారాయణ, ప్రజా సంఘాల నాయకులు సీతాదేవి, వెంకటలక్ష్మి, శ్రీదేవి, పద్మ, రమణమ్మ, అప్పలనర్సమ్మ, కెవిపిఎస్‌ నాయకులు భాగం లక్ష్మి పాల్గొన్నారు. భారీ ర్యాలీ, ఆకట్టుకున్న కళారూపాలు తొలుత పద్మనాభం పురవీధుల్లో ర్యాలీ సాగింది. కోలాటం. చిడతలు వంటి కళారూపాలు ప్రజలను ఆకట్టుకున్నాయి. అభ్యుదయ గీతాలు చైతన్యం నింపాయి. కార్యాలయ ఆవరణలో సిఐటియు జెండా ఆవిష్కరణ జరిగింది. ప్రాథమిక స్థాయి పిల్లలకు డ్రాయింగ్‌ పోటీలు నిర్వహించి బహుమతులు, ధ్రువపత్రాలను అతిథులు అందజేశారు. సభలో అంగన్‌వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన పథకం, క్వారీ కార్మికులు, ఆటో కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

➡️