ప్రజాశక్తి – చేబ్రోలు : నిబంధనలకు విరుద్ధంగా ఇళ్ల మధ్యలో అక్రమంగా మద్యం అమ్మడాన్ని నిరసిస్తూ మంగళవారం సిఐటియు ఆధ్వర్యంలో చేబ్రోలులో నిరసన తెలిపారు. మండలంలోని కొత్త రెడ్డిపాలెం చెన్నా రెడ్డి కాలనీ సెంటర్ వద్ద వల్లూరి శ్రీనివాసరావు అనే వ్యక్తి అక్రమంగా మధ్య అమ్మకాలను వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు గుంటూరు జిల్లా అధ్యక్షులు దండా లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ స్కూల్, కాలేజీ, పిల్లలు, మహిళలు నిరంతరం సంచరించే ప్రాంతంలో మద్యం అమ్మకాల వల్ల మహిళలకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందన్నారు. ఒకవైపు ముఖ్యమంత్రి బెల్ట్‌షాపులు అనుమతి లేదన చెబుతున్నారని, మరోవైపు ఆ పార్టీకి చెందిన వ్యక్తులు బెల్టు షాపులను నిర్వహిస్తూ అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. ఇళ్ల మధ్య అమ్మడం వల్ల తాగినవాళ్లు చుట్టుపక్కల ఇళ్లలోకి వచ్చి తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్నారని అన్నారు. ఈ సమస్య పరిష్కరించకపోతే ప్రత్యక్ష ఆందోళనకు దిగాల్సి వస్తుందని హెచ్చరించారు. పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు స్పందించి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఆదిశేషులు, శ్రీనివాసులు, కేలోతు లక్ష్మి, కేతావత్ చిలకమ్మ,తదితరులు పాల్గొన్నారు.