- సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నర్సింగరావు
ప్రజాశక్తి – కలెక్టరేట్ (విశాఖపట్నం) : విద్యుత్‌రంగ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ఐక్య పోరాటం సాగించాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్.నర్సింగరావు పిలుపునిచ్చారు. విద్యుత్ రంగం ప్రయివేటీకరణ ఆపాలని, కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలని విశాఖలోని అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో శనివారం జరిగిన సదస్సులో ఆయన ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని ప్రయివేటుపరం చేస్తోందన్నారు. గత ప్రభుత్వం విద్యుత్ రంగానికి నష్టం కలిగించే ఒప్పందాలను, ప్రజలపై భారాలు పెంచే చర్యలను చేపట్టిందని తెలిపారు. ఈ క్రమంలో విద్యుత్ రంగంలో అక్రమాలను వెలికి తీస్తామని, ప్రజలపై భారాలు మోపబోమని హామీలిచ్చి టిడిపి కూటమి అధికారంలోకి వచ్చిందన్నారు. ఇచ్చిన హామీలకు భిన్నంగా గడిచిన పది నెలల కాలంలో ట్రూ అప్ ఛార్జీల పేరుతో రూ.15 వేల కోట్ల భారాలను ప్రజలపై ప్రభుత్వం మోపిందని వివరించారు. గతంలో జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం సెకీతో ఒప్పందం చేసుకొని విద్యుత్ ఛార్జీలను భారీగా పెంచిందని, ఆ ఒప్పందం వల్ల రాష్ట్ర ప్రజలపై రూ.32 వేల కోట్ల భారాలు పడ్డాయని తెలిపారు. టిడిపి కూటమి ప్రభుత్వం ఆ ఒప్పందాన్ని రద్దు చేయడం కుదరదని చెప్పడం సరికాదన్నారు. కార్పొరేట్ కంపెనీల లబ్ధి కోసమే పాత ఒప్పందాలను కొనసాగిస్తోందని విమర్శించారు. అధికారంలోకి వస్తే స్మార్ట్ మీటర్లు రద్దు చేస్తామని, స్మార్ట్ మీటర్లు బిగిస్తే పగలగొట్టండని ప్రగల్భాలు పలికిన టిడిపి అదే స్మార్ట్ మీటర్లను ఇంటింటికీ బిగించే చర్యలు చేపడుతోందన్నారు. రూ.85 లక్షల కోట్ల విలువైన ఆస్తులున్న విద్యుత్తు రంగాన్ని కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడానికి టిడిపి కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందన్నారు. విద్యుత్ శాఖలో కాంట్రాక్ట్ కార్మికులు దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారని తెలిపారు. పీస్ రేటు కాంట్రాక్టు పేరిట ఉద్యోగుల శ్రమను దోచుకుంటున్నారని విమర్శించారు. షిఫ్ట్, కంప్యూటర్ ఆపరేటర్లు, లైన్‌మ్యాన్లు, సచివాలయం జెఎల్‌ఎంలు తక్కువ వేతనాలతో పని చేస్తున్నారని తెలిపారు. స్టోర్స్‌లో పనిచేస్తున్న హమాలీలు, మీటర్ రీడర్లు పీస్ రేట్ పద్ధతితో తక్కువ వేతనాలు పొందుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో యూనియన్లతో నిమిత్తం లేకుండా విద్యుత్ ఉద్యోగులందరూ సంస్థను రక్షించుకోవడానికి, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయడానికి పోరాటాలు నిర్వహించాలని కోరారు. యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేపాడ సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుదర్శన్ రెడ్డి, అధ్యక్షులు సూరిబాబు, నాయకులు పాల్గొన్నారు.