స్వచ్ఛభారత్‌ కార్మికులకు పెండింగ్‌ వేతనాలు ఇవ్వాలి : సీఐటీయూ

ప్రజాశక్తి-నంద్యాల కలెక్టరేట్‌ : నంద్యాల జిల్లాలోని గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్న స్వచ్ఛభారత్‌ కార్మికులకు పెండింగ్‌ వేతనాలు వెంటనే ఇవ్వాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు వి. ఏసు రత్నం ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.సోమవారం స్వచ్ఛభారత్‌ కార్మికులతో కలసి జిల్లా కలెక్టర్‌ రాజకుమారి గణియా ను కలిసి వినతిపత్రం సమర్పించారు. అనంతరం స్వచ్ఛభారత్‌ కార్మికులతో కలసి ఏసు రత్నం మీడియాతో మాట్లాడుతూ గ్రామాలలో వీధులను శుభ్రపరుస్తూ మురికి కాలువలను క్లీన్‌ చేస్తూ ప్రభుత్వ అధికారులు గ్రామాలకు వచ్చినప్పుడు నిత్యం అందుబాటులో ఉంటూ సేవలు చేస్తున్న స్వచ్ఛభారత్‌ కార్మికులకు నెలనెలా జీతాలు ఇవ్వకుండా అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.ఇప్పటికి రెండుసార్లు 15 ఫైనాన్స్‌ నిధులు వచ్చిన స్వచ్ఛ భారత్‌ కార్మికులకు అరకొర వేతనాలు ఇచ్చారు. ఇప్పటికీ స్వచ్ఛభారత్‌ కార్మికులకు 10 నుంచి 16 నెలల వేతనాలు పెండింగ్లో ఉన్నాయి. కొన్ని గ్రామాలలో స్వచ్ఛభారత్‌ కార్మికులను తొలగించి వారికి రావలసిన వేతన బకాయిలు కూడా ఇవ్వకుండా సర్పంచులు ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వేతనాలు అడుగుతే బడ్జెట్‌ లేదని,అసలు మీరు పనే చేయలేదని చెప్పేసి స్వచ్ఛభారత్‌ కార్మికులకు చేసిన పనికి కూడా వేతనాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. వేతనాలు ఇప్పించాల్సిన ఎంపీడీవో ఈవోఆర్డి పంచాయతీ కార్యదర్శులు ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ స్వచ్ఛభారత్‌ కార్మికుల కడుపులు కొడుతున్నారు. జిల్లా కలెక్టర్‌ జిల్లా డిపిఓ జిల్లావ్యాప్తంగా స్వచ్ఛభారత్‌ కార్మికులకు రావలసిన పెండింగ్‌ వేతనాల పైన సమాచారం తెప్పించుకొని వేతనాలు ఇవ్వనిసర్పంచుల పైన అధికారుల పైన వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. పెండింగ్‌ వేతనాలు ఇవ్వని పక్షంలో జిల్లావ్యాప్తంగా కార్మికులను సమీకరించి ఆందోళన చేయాల్సి వస్తుందని వారు తెలిపారు. నంద్యాలలో పాములపాడు మండలం ఇస్కాల గ్రామానికి చెందిన స్వచ్ఛభారత్‌ కార్మికులు 16 నెలల పెండింగ్‌ వేతనాల కోసం బనగానపల్లె మండలం కైప గ్రామానికి చెందిన స్వచ్ఛభారత్‌ కార్మికులు తమకు రావాల్సిన 10 నెలల వేతనాల కోసం జిల్లా కలెక్టర్‌ కలిసి మెమొరాండం ఇవ్వడం జరిగింది. చిన్న ఉద్యోగుల పట్ల నిర్లక్ష్య భావాన్ని ప్రదర్శించకుండా చేసిన పనికి వేతనాలు ఇచ్చి వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని వారు కోరారు. ప్రభుత్వం 680 జీవ తీసుకొని వచ్చి నేటికి నాలుగు సంవత్సరాలు కావస్తున్న నెలకు పదివేల వేతనం జీవ అమలు కావడం లేదు. చెత్త బండ్లు రిపేరుకు డబ్బులు ఇవ్వడం లేదు. డ్రెస్సులు మాస్కులు చెప్పులు డ్రెస్సులు ఇవ్వడం లేదు. వెంటనే జిల్లా డిపిఓ చర్యలు తీసుకొని స్వచ్ఛభారత్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని లేకపోతే సిఐటియు నాయకత్వంలో ఆందోళన చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో శివలింగం స్వాములు తిరుపతయ్య చిన్న లింగస్వామి ప్రభావతి భారతి తదితరులు కలెక్టర్‌ ను కలిసిన వారిలో ఉన్నారు.

➡️