ప్రజాశక్తి-గిద్దలూరు రూరల్ : గిద్దలూరు తహశీల్దార్ కార్యాలయం దగ్గర బుధవారం ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న పాఠశాల పారిశుధ్య (ఆయా) కార్మికుల సమస్యలపై ధర్నా నిర్వహించి అనంతరం గిద్దలూరు తహశీల్దార్ ఎం ఆంజనేయరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు టీ ఆవులయ్య, బి నరసింహులు మాట్లాడుతూ 10 సంవత్సరాల నుంచి ప్రభుత్వ పాఠశాలల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తున్న స్కూల్ శానిటైజర్లకు కనీస వేతనం అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. రాజకీయ వేధింపులు ఆపాలని, పీఎఫ్, ఈఎస్‌ఐ అమలు, నెలకు రూ.6,000తో కార్మికుల కుటుంబాల జీవనం ఇబ్బందిగా కొనసాగుతున్నదని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు చెల్లించాలని, 2024 జనవరి నుంచి మార్చి వరకూ పెండింగ్‌లో ఉన్న మూడు నెలల వేతనాలు చెల్లించాలని అన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో స్కూల్ శానిటైజర్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఎస్‌కె షబీర, వై రాధ, మేరీ, జహీరా, సీఐటీయూ నాయకులు డి థామస్ పాల్గొన్నారు.
