ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కారం చేయాలి : సిఐటియు

పుంగనూరు (చిత్తూరు) : ప్రభుత్వ రంగ సంస్థ ఆర్టీసీని బలోపేతం చేసి సంస్థలో పని చేస్తున్న సిబ్బందికి పని ఒత్తిడి తగ్గించాలని శుక్రవారం పుంగనూరు డిపోలో జరిగిన ఎస్డబ్ల్యుఎఫ్‌ సమావేశంలో ఆర్టీసీ జోనల్‌ కార్యదర్శి భాస్కర్‌, సిఐటియు జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ … గత ప్రభుత్వాలు చేసిన తప్పిదం వలన ఆర్టీసీ నష్టాల్లో లోకి వెళ్లిందని ఇప్పటికైనా నూతన ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థను కాపాడే విధంగా నిధులు కేటాయించి బలోపేతం చేయాలని డిమాండ్‌ చేశారు. సంస్థలో పనిచేస్తున్న సిబ్బంది రకరకాల ఒత్తిడితో అనారోగ్యాలకు గురవుతున్నారని పని ఒత్తిడి తగ్గించాలని కోరారు. మహిళా కండక్టర్లకు రాత్రి సమయాల్లో డ్యూటీలు చేస్తూ ఇబ్బందులు పెడుతున్నారని వారికి మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. అర్ధరాత్రిలో డ్యూటీలు దిగినవారికి ఆయా డిపోల్లో మౌలిక వసతులతో విశ్రాంతి గదులు ఏర్పాటు చేయాలని వాటిపై దృష్టి పెట్టాలని కోరారు. ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించడంలో ఆర్టీసీ ముందంజలో ఉందని దానికి తగ్గట్టు ఏర్పాట్లు కూడా చేయాలన్నారు. కాలుష్యం నియంత్రణ పేరుతో ఎలక్ట్రికల్‌ బస్సులు తీసుకురావడం మంచిదే అయినప్పటికీ వాటిని ఆర్టిసినే నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. ప్రైవేట్‌ పరం ఆలోచనలు మానుకోవాలని డిమాండ్‌ చేశారు. స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ ఎస్డబ్ల్యుఎఫ్‌ సిఐటియు ఆధ్వర్యంలో సంస్థ రక్షణ కోసం కార్మికుల సమస్యలు పరిష్కారం కోసం అనేక పోరాటాలు చేశారని, వాటిని భవిష్యత్తులో ఉధృతం చేస్తామని తెలిపారు. పుంగనూరు డిపోలో కార్మికుల సమస్యలను పరిష్కారం చేయాలని డిమాండ్‌ చేశారు.

ఎస్డబ్ల్యుఎఫ్‌ కమిటీ ఎన్నిక
పుంగనూరు డిపో ఎస్డబ్ల్యుఎఫ్‌ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికయింది. అధ్యక్షులుగా వాడ గంగరాజు అధ్యక్షురాలుగా మమత, కార్యదర్శిగా నాగార్జున, ఉపాధ్యక్షుడు హరినాథ్‌, సహాయ కార్యదర్శి కె.వి రెడ్డమ్మ, కోశాధికారిగా శోభ, ప్రచార కార్యదర్శులుగా ప్రమీల, శిరీష లతోపాటు ఐదుగురిని కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ … ఆర్టీసీ కార్మికుల సమస్యలపై కమిటీ కృషి చేస్తుందని తెలిపారు.

➡️