ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ (రాయచోటి-అన్నమయ్య) : కార్మికుల పట్ల వేధింపులకు పాల్పడుతున్న మునిసిపల్ కమిషనర్ రాంబాబు పై తగు చర్యలు తీసుకొని కార్మికులకు న్యాయం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు చిట్వేలి రవికుమార్ డిమాండ్ చేశారు. మునిసిపల్ కమిషనర్ రాంబాబు నిరంకుశ ధోరణిని ఖండిస్తూ బుధవారం సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట మునిసిపల్ కార్మికులతో కలిసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా చిట్వేలి రవికుమార్ మాట్లాడుతూ 14 మంది కార్మికులు 2021 డిసెంబర్ ఒకటవ తేదీన డైలీ వర్కర్లుగా కార్యాలయంలో విధుల్లో చేరి పట్టణ పరిధిలో చక్కగా పారిశుధ్యం నిర్వహిస్తున్నారని తెలిపారు. కానీ ప్రస్తుత మునిసిపల్ కమిషనర్ రాంబాబు హఠాత్తుగా డైలీ వర్కర్లు విధులలోంచి తప్పుకోవాలని ఆదేశాలు జారీ చేశారని, వారికి సంబంధించిన నాలుగు నెలల జీతభత్యాలు ఇవ్వకుండా వేధింపులకు గురి చేస్తున్నాడని ఆరోపించారు. వీటిపై ప్రశ్నించిన కార్మికుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని తెలిపారు. ఆ 14 మంది పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తూ వచ్చిన జీతభత్యాలతో కుటుంబాన్ని నడుపుకుంటూ పిల్లల చదువు, తిండి, బట్ట సమకూర్చుకోగలుగుతూ అద్దె భవనాలలో కాలం వెళ్ళబుచ్చుతున్నారని., కమిషనర్ రాంబాబు దుశ్చర్యలతో గత నాలుగు నెలల నుంచి వేతనాలు లేక ఇంటి అద్దె కూడా కట్టుకునే స్తోమత లేక కార్మికులు అలమటిస్తున్నారని ఆవేదన చెందారు. శ్రమజీవులైన మున్సిపల్ కార్మికుల పట్ల కమిషనర్ వ్యవహరిస్తున్న తీరు సమంజసం కాదని, వెంటనే కమిషనర్ పై చట్టపరమైన చర్యలు తీసుకొని కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని వేతన బకాయిలు చెల్లించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఈ మేరకు సబ్ కలెక్టర్ కార్యాలయంలోని ఏవో కు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల నాయకురాలు డి.లక్ష్మీదేవి, కొండయ్య, సుబ్రహ్మణ్యం, నరసింహులు, ధనమ్మ, నరసయ్య, మున్సిపల్ కార్మికులు పాల్గన్నారు.
