ప్రజాశక్తి-తిరుపతి టౌన్ : ప్రమాదంలో భర్తను కోల్పోయిన మహిళ కుటుంబానికి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు 50 వేల రూపాయల ఆర్థిక సాయం చెక్కును జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ శుక్రవారం అందజేశారు. తిరుమల తిరుపతి జిల్లా రెండు రోజుల పర్యటన నేపథ్యంలో రేణిగుంట విమానాశ్రయంకు విచ్చేసిన ముఖ్యమంత్రిని విమానాశ్రయం వెలుపల అర్జీదారురాలు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బజ్జల సుధీర్ రెడ్డి ద్వారా కె.సుబ్బరత్నమ్మ కలిసి తన భర్త కె.ప్రసాద్ గత సంవత్సరం ఏప్రిల్ నెలలో యాక్సిడెంట్లో చనిపోయారని తెలిపారు. ఆర్థికంగా తాము బాగా చితికిపోయామని, తనకు ఇద్దరి పిల్లల్లో ఒకరికి ఆరోగ్యం సరిగా లేదని సహాయం చేసి ఆదుకోవాలని కోరారు. దీంతో ముఖ్యమంత్రి వారి కుటుంబానికి సత్వర సహాయంగా 50 వేల రూపాయల చెక్కును ఆర్థిక సాయం అందించవలసిందిగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్లు ను ఆదేశించారు. ఈరోజు జిల్లా కలెక్టర్ 50 వేల రూపాయల చెక్కును సంబంధిత మహిళకు రేణిగుంట విమానాశ్రయం నందు అందజేశారు. ఈ కార్యక్రమంలో జేసీ శుభం బన్సల్, డిఆర్‌ఓ పెంచల కిషోర్ తదితరులు పాల్గొన్నారు.