మాట్లాడుతున్న విజరుకుమార్
ప్రజాశక్తి – పల్నాడు జిల్లా : ప్రజాస్వామ్య విలువల గురించి ఎన్నికలకు ముందు మాట్లాడిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటికి తూట్లు పొడుస్తోందని, అధికారంలోకి రావడం కోసం ఇచ్చిన హామీల అమలునూ విస్మరించిందని సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజరుకుమార్ విమర్శించారు. నరసరావుపేట పట్టణం కోటప్పకొండ రోడ్డులోని పల్నాడు విజ్ఞాన కేంద్రంలో సిపిఎం పల్నాడు జిల్లా కమిటీ సమావేశం కార్యదర్శివర్గ సభ్యులు వై.రాధాకృష్ణ అధ్యక్షతన గురువారం జరిగింది. విజరుకుమార్ మాట్లాడుతూ ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పిడిఎఫ్ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేసిన యుటిఎఫ్ నాయకులపై, ప్రజా సంఘాలపై కూటమి నేతలు బెదిరింపులకు పాల్పడడం తగదన్నారు. అన్నదాత సుఖీభవ కింద రైతులకు పెట్టుబడి సాయం రూ.20 వేలు ఇవ్వకుండా మొండి చేయి చూపారని, పంట దిగుబడులు తగ్గడంతోపాటు మద్దతు ధరలు సైతం లేకపోవడంతో రైతులు అల్లాడుతున్నారని చెప్పారు. రైతుల పక్షాన మాట్లాడిన రైతుసంఘం నాయకులను టిడిపి నాయకులు బెదిరిస్తున్నారు. వలసలు నివారించేందుకు ప్రవేశపెట్టిన ఉపాధి హామీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేసి వలసలు నివారించాలని, 200 రోజులు పని దినాలు కల్పించాలని డిమాండ్ చేశారు. పనుల కోసం కూలీలు ఇతర ప్రాంతాలకు వెళ్తున్న క్రమంలో ప్రమాదాలకు గురై ఇటీవల ఆరుగురు చనిపోగా 70 మందికి పైగా గాయపడ్డారని, మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు న్యాయం చేయాలని కోరారు. కౌలురైతులకు గుర్తింపు కార్డులు, పంట రుణాలు ఇవ్వాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లేబర్ కోర్టులను రద్దుచేసి కాంటాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు న్యాయం చేయాలని, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ యోచనను మానుకుని పరిశ్రమ అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరారు. బనకచర్ల పేరుతో వరికపూడిశెల ప్రాజెక్ట్‌ను నిర్లక్ష్యం చేస్తే సహించబోమని, ప్రజలను, రైతులను ఏకం చేసి పోరాడతామని ఉద్ఘాటించారు. వెనుబడిన పల్నాడు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని కోరుతూ సిపిఎం చేపట్టే పోరాటాల్లో ప్రజలంతా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఏపూరి గోపాలరావు, జి.రవిబాబు, ఎ.లక్ష్మీశ్వరరెడ్డి, ఎస్.ఆంజనేయులు నాయక్, సీనియర్ నాయకులు గద్దె చలమయ్య పాల్గొన్నారు.
