ప్రజాశక్తి – ఆలమూరు : రైతులకు బాసటగా కూటమి ప్రజా ప్రభుత్వం అన్ని విధాలుగా పనిచేస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. మండలంలోని బడుగువానిలంకలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన గోకులం షెడ్డులను ఆయన, నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ బండారు శ్రీనివాసరావుతో కలసి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యానందరావు మాట్లాడుతూ పాడి, పంటలు మన సంస్కృతికి పునాదులని వాటిని కాపాడుకోవాలన్నారు. అందుకే రైతులకు అండగా నిలిచేందుకు ఈ గోకులం పథకం ఉపయోగ పడుతుందన్నారు. గ్రామంలో మూడు గోకులం షెడ్డులను నిర్మించి ప్రారంభించామన్నారు. అలాగే మండలంలో మొత్తం 49 గోకులాలు మంజూరు చేశామని, అందులో 22 ఇప్పటికే పూర్తి చేశామన్నారు. మిగిలిన వాటిని ఈ నెలాఖరులోగా అధికారులు పర్యవేక్షణ లోపం లేకుండా తప్పకుండా పూర్తి చెయ్యాలని వారికి ఆదేశించారు. ఇందులో భాగంగా ఒక రైతు ఏర్పాటుచేసిన ఎడ్ల బండిని వారు నడిపి, మన సంస్కృతికి బాసటగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల డిసి అధ్యక్షులు మెర్ల గోపాలస్వామి, సర్పంచ్ దూలం వెంకటలక్ష్మి సత్తిబాబు, ఎంపీటీసీ సభ్యులు పడాల నాగలక్ష్మి అమ్మిరాజు, జనసేన మండల అధ్యక్షుడు సూరపురెడ్డి సత్య, టిడిపి సీనియర్ నేతలు పాలూరి గోవిందరాజు, ఈదల నల్లబాబు, ఒంటిపల్లి సతీష్, ఎంపీడీవో ఏ.రాజు, ఏపీవో అరుణకుమారి, కార్యదర్శి విజయ రెడ్డి, తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.