కూటమి ప్రభుత్వం.. ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయాలి

Oct 4,2024 18:24 #kakianda

ప్రజాశక్తి – పెద్దాపురం : కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఉచిత ఇసుకను తక్షణం అమలు చేయాలని కోరుతూ శుక్రవారం సిపిఎం ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు ప్రదర్శన నిర్వహించారు. ప్రదర్శన అనంతరం ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా చేసి అనంతరం ఆర్డీవో కార్యాలయం ఏవో కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి నీలపాల సూరిబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయినా ఉచిత ఇసుక అమలు కాకపోవటం అన్యాయమన్నారు.ఇసుక లభించకపోవడం,ఇసుక ధరలు పెరిగిపోవటం, విచ్చలవిడి అవినీతి వల్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందన్నారు. వైసిపి ప్రభుత్వం గద్దె దిగడంలో ఇసుక సమస్య కూడా ఒక కారణమన్నారు. అనేక ప్రాంతాలలో ఇసుక లభించడం లేదని, రవాణా చార్జీలు, ఇతర పేర్లు చెప్పి ధరలు పెంచుతున్నారన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికార పార్టీ నేతలు కొన్నిచోట్ల ఇసుకపై పెత్తనం చేస్తున్నారన్నారు. ఇసుక కొరత, అధిక ధరల వల్ల చేతినిండా పని లేక భవన నిర్మాణ కార్మిక కుటుంబాలు అవస్థలు పడుతున్నాయన్నారు. స్థానిక యాసలపు సూర్యారావు భవనం నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ నువ్వుల గుంట వీధి, మేదర వీధి, శివాలయం వీధి, సినిమా సెంటర్, వెంకటేశ్వర స్వామి గుడి సెంటర్, మెయిన్ రోడ్,మున్సిపల్ సెంటర్ మీదుగా ఆర్డీవో కార్యాలయంకు చేరుకుంది. ఈ కార్యక్రమంలో ఎస్ శ్రీనివాస్,కేదారి నాగు, వడ్డి సత్యనారాయణ, పాసిల రమణ, తైనాల శ్రీను,గొల్ల బాబు, చింతల సత్యనారాయణ,విష్ణు, సూర్యనారాయణ,ఇబ్రహీం, భూసారి శ్రీను, భాషా, హరిబాబు, శివ, గడిగట్ల సత్తిబాబు, కె వీరబాబు, ముమ్మన శ్రీను, వాసంశెట్టి ఏసు, గంగాధర్, డి కృష్ణ, మరిడియ్య, రమేష్, సత్యనారాయణ, వీర్రాజు, క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

➡️