ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ (విశాఖ) : చిన్న వాల్తేర్ కోటక్ స్కూల్ వద్ద తొలగించిన తోపుడుబండ్లను యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ … ఆదివారం ఉదయం చిన్న వాల్తేర్ మెంటల్ హాస్పిటల్ జంక్షన్ నుండి వామన జంక్షన్ మీదుగా కొటక్ స్కూల్ రైల్వే గెస్ట్ హౌస్ సెంటర్ వరకు సిఐటియు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. తొలగించిన తోపుడు బండ్లు, చిల్లర వర్తకులను యధావిధిగా కొనసాగించాలని, వెండింగ్ జోన్ ఏర్పాటు చేయాలని, ఉపాధి రక్షణ కల్పించాలని, కూటమి ప్రభుత్వం తోపుడుబండ్లు చిల్లర వర్తక కార్మికులకు ఉపాధి అవకాశం ఇవ్వాలని నినాదాలు చేశారు. ర్యాలీ అనంతరం మెంటల్ హాస్పిటల్ జంక్షన్ వద్ద నిర్వహించిన సభలో విశాఖపట్నం తోపుడు బండ్లు, చిల్లర వర్తక కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ. సింహాచలం మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ మూడు నెలల కాలంలో తోపుడు బండ్లు కార్మికులపై దాడులు పెరిగాయని విమర్శించారు. నోటీసులు ఇవ్వకుండా తోపుడు బండ్లు తొలగించరాదని అన్నారు.జీవీఎంసీ కమిషనర్ చిన్న వాల్తేర్ కోటక్ స్కూల్ తోపుడుబండ్లును ట్విట్టర్ కంప్లైంట్ ద్వారా తొలగించడం అన్యాయమని అన్నారు. నగరంలో అనేక చోట్ల అమూల్ బడ్డీలు ఉండగా చిన్న చిన్న తోపుడుబండ్లే మీకు కనిపించాయా అని ప్రశ్నించారు. తక్షణం తొలగించిన తోపుడుబండ్లను యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. సిఐటియు సీనియర్ నాయకులు అనపర్తి అప్పారావు మాట్లాడుతూ రోడ్డు ప్రక్కన బ్రతికే తోపుడుబండ్లు, చిల్లర వర్తకులను బ్రతకనివ్వాలని కోరారు. రెక్కాడితే గాని డొక్కాడని కార్మికులని వీరిపై దాడులు చేయడం అన్యాయమని అన్నారు. సిఐటియు మద్దిలపాలెం జోన్ నాయకులు కే.కుమారి మాట్లాడుతూ తొలగించిన తోపుడుబండ్లను యధావిధిగా కొనసాగించకపోతే నగరంలో ఉన్న తోపుడు బండ్లు కార్మికులను కదిలించి జీవీఎంసీ ఆఫీసును ముట్టడిస్తామని హెచ్చరించారు. మద్దిలపాలెం జోన్ సిఐటియు కార్యదర్శి, తోపుడు బండ్లు రంగం గౌరవ అధ్యక్షులు పి.వెంకటరావు మాట్లాడుతూ 100 రోజుల్లో టిడిపి,జనసేన,బిజెపి కూటమి ప్రభుత్వం తోపుడుబండ్ల కార్మికులను వేధించడం, తొలగించడం కార్యక్రమంగా తీసుకుందని విమర్శించారు. జీవీఎంసీ కమిషనర్ ద్వారా సిరిపురం జంక్షన్, కోటక్ స్కూల్ తోపుడు బండ్లు కార్మికులపై కూటమి ప్రభుత్వం దాడులు చేయిస్తుందని అన్నారు. 2014 స్ట్రీట్ వెండర్స్ చట్టం ప్రకారం ఎక్కడ బ్రతుకే తోపుడుబండ్లు,చిల్లర వర్తక కార్మికులు అక్కడే బ్రతకనీయాలని చట్టం చెబుతుందని అన్నారు. వీరికి వెండింగ్ జోన్స్ ఏర్పాటు చేయాలని, వెండింగ్ కార్డులు ఇవ్వాలని అన్నారు. ఎన్‌ఏడి కొత్త రోడ్డు నుండి మధురవాడ వరకు రెండు ప్రక్కల నేషనల్ హైవే స్థలం గ్రీన్ బెల్ట్ లో షాపింగ్ కాంప్లెక్స్ లు, కార్ల షోరూములు నడుపుతున్నా జీవీఎంసీ అధికారులు వారిపై చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. తక్షణం చిన్న వాల్తేర్ కోటక్ స్కూల్ తోపుడు బండ్లు కార్మికులను యధావిధిగా కొనసాగించాలని, లేనియెడల పోరాటాన్ని మరింత ఉదఅతం చేస్తామని హెచ్చరించారు. చిన్న వాల్తేర్ కోటక్ స్కూల్ తోపుడుబండ్ల సంఘం అధ్యక్షులు ఏ.అప్పారావు మాట్లాడుతూ తోపుడుబండ్లపై ఆధారపడి మా కుటుంబాలు బ్రతుకుతున్నాయని, తోపుడుబండ్లు తొలగించడం వల్ల రోడ్డున పడ్డామని అన్నారు. గత 15 సంవత్సరాల నుండి బ్రతుకుతున్న మమ్మలను అక్కడే బ్రతకనివ్వాలని జీవీఎంసీ అధికారుల్ని కోరారు. తోపుడు బండ్లు సంఘం నాయకులు కే.ఎన్.గణేష్, కే. రాజు ఈ కార్యక్రమంలో సుమారు 50 మంది తోపుడుబండ్ల కార్మికులు పాల్గొన్నారు.