చలి గాలులు.. చిరుజల్లులు..

Dec 3,2024 10:20 #Cold winds, #Light rains

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : తుపాను ప్రభావంతో పల్నాడు జిల్లాలో చలి గాలులు వీస్తున్నాయి. మరో వైపు చిరు జల్లులు కురుస్తున్నాయి. చల్లని గాలులతో చలి తీవ్రత పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు పొలాల్లో ఉన్న వరి చేలను కాపాడుకునేందుకు రైతులంతా అప్రమత్తమయ్యారు. జిల్లా వ్యాప్తంగా గత నెల 30 నుండి చల్లని గాలులు, చిరు జల్లులతో కూడిన తేలికపాటి వర్షం కురుస్తూనే ఉంది. పండిన పంట చేతికి వచ్చే సమయంలో తుపాను కారణంగా కురుస్తున్న వర్షం వల్ల రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే నూర్పిడి చేసిన ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని నేల వాలిన వరి దుబ్బులను కట్టలుగా కట్టాలని ఉప్పునీటి ద్రావణం పిచికారీ చేయడం ద్వారా గింజ నాణ్యత దెబ్బ తినకుండా పంటను కాపాడుకునే అవకాశం ఉందని జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఐ. మురళి రైతులకు సూచించారు. పల్నాడు జిల్లాలో ఖరీఫ్‌ లో 85990 ఎకరాలలో వరి సాగు చేయగా రభీలో 11732.5 ఎకరాలు సాగు చేపట్టారు.

అప్రమత్తమైన రైతులు..
పల్నాడు జిల్లాలో ఇప్పటికే కొన్ని ప్రాంతాలలో వరి నూర్పిడి దశలో ఉంది. ఫెంగల్‌ తుపాను ప్రభావంతో పల్నాడు జిల్లాలో గత నెల చివరి శనివారం నుండి తేలికపాటి వర్షపు జల్లులు కురుస్తున్నాయి. వివిధ గ్రామాలలో ఇప్పటికే వరి చేలు కోతలు కోసిన రైతులు తమ పంటలు తుపాను ముప్పుతో పాడైపోతాయేమోనని అప్రమత్తమయ్యారు. యంత్రాల ద్వారా పంట నూర్పిడి చేసిన రైతులు పొలంలో ఉన్న ధాన్యం కాపాడుకునేందుకు రైతులు టార్పెయిన్లను ధాన్యం కుప్పలపై కప్పుతున్నారు. ఈ తుపాను బుధవారం వరకు ఇదే విధంగా వాతావరణం ఉంటే ధాన్యం రంగు మారి మానుగాయ ఆశించే అవకాశం ఉన్నందున రైతులు ఆందోళన చెందుతున్న పరిస్థితి నెలకొంది.

➡️