హై లెవెల్‌ బ్రిడ్జి పనులను పరిశీలించిన కలెక్టర్‌

Jun 8,2024 21:05

ప్రజాశక్తి – పాచిపెంట : మండలంలోని కుంటాం – తుమ్మగుడ్డి రహదారిలో నిర్మిస్తున్న హై లెవెల్‌ బ్రిడ్జి పనులను కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ శనివారం తనిఖీ చేశారు. మెట్టగుడ్డి మీదుగా రూ. 5.75 కోట్లుతో రహదారి నిర్మాణం జరుగుతోంది. పనుల నాణ్యత, వివిధ అంశాల్లో జరగాల్సిన పనుల వివరాలను పరిశీలించారు. కొద్ది రోజుల్లో వర్షాలు ప్రారంభమయ్యే అవకాశాలు ఉంటాయని, పనులు త్వరగా పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. ప్రజలకు రహదారి అందుబాటులోకి రావడం వల్ల ఇతర ప్రాంతాలతో అన్ని విధాలా అనుసంధానం జరుగుతుందని చెప్పారు. జిల్లా పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ అధికారి డా.ఎంవిఆర్‌ కృష్ణాజీ పనుల వివరాలు తెలిపారు. బ్రిడ్జి నిర్మాణం పూర్తి కావడం వల్ల అరకుతో సహా దాదాపు 20 గ్రామాలకు అనుసంధానం లభిస్తుందని వివరించారు. ఇదిలా ఉండగా సంవత్సర కాలంలో 52 రహదారులకు అటవీ అనుమతులు జారీ చేసి, మారు మూల ప్రాంతాలలో రహదారి సౌకర్యం కల్పించుటకు జిల్లా కలెక్టర్‌ చొరవ చూపారు. బ్రిడ్జి నిర్మాణం వల్ల గ్రామస్తులు అరకుకు కేవలం 30 కిలో మీటర్ల దూరంలో ఉంటారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

➡️