ప్రజాశక్తి-విజయనగరంకోట : జిల్లాలో 108 అత్యవసర సేవలకు ఆటంకం కలగకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలనికలెక్టర్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రవాణా, వైద్య ఆరోగ్య అధికారులను ఆదేశించారు. 108 సిబ్బంది సమ్మెకు వెళ్తున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ చెప్పారు. జిల్లాలో 108 వాహనాలు 28 ఉన్నాయని వాటిని నడిపేందుకు ఆయా మండలాల్లో లభ్యమయ్యే డ్రైవర్లను గుర్తించి సిద్ధంగా ఉంచాలన్నారు. ఒక్కో వాహనానికి ఇద్దరు చొప్పున పేర్లను గుర్తించి జాబితా సిద్ధం చేయాలన్నారు. ఆర్టీసీలో శిక్షణ పొందిన డ్రైవర్లను గుర్తించి సిద్ధం చేస్తామని ఉప రవాణా కమిషనర్ మణిశంకర్ తెలిపారు. సమావేశంలో ఇన్‌ఛార్జి డిఎంహెచ్‌ఒ డాక్టర్ కె.రాణి, డిసిహెచ్‌ఎస్ డాక్టర్ రాజేశ్వరి, వాహన తనిఖీ అధికారి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
పిఎం జన్‌మన్‌తో మౌలిక సదుపాయాలు
ప్రధానమంత్రి జన్ మన్ కార్యక్రమం ద్వారా కొన్ని ప్రత్యేక గిరిజన తెగల (పివిటిజి) అభివృద్ధికి, వారి గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలని కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదేశించారు. ఎంపిక చేసిన గ్రామాల్లో సమగ్ర సర్వే నిర్వహించాలని సూచించారు. గదబ తదితర అతి సున్నిత గిరిజన తెగలు నివసించే గ్రామాలు జిల్లాలోని 7 మండలాల్లో 52 వరకు ఉన్నాయని చెప్పారు. వీటిలో ఐదు గ్రామాలను ఆదర్శగ్రామాలుగా తీర్చిదిద్దాలని సూచించారు. జెసి ఎస్.సేతు మాధవన్, జిల్లా గిరిజన సంక్షేమాధికారి బి.రామానందం, జెడ్‌పి సిఇఒ బివి సత్యనారాయణ, ఐసిడిఎస్ పీడీ శాంతకుమారి తదితరులు పాల్గొన్నారు.