పారిశుధ్య పనులపై ప్రత్యేక శ్రద్ధ : కలెక్టర్‌

Jun 10,2024 21:48

ప్రజాశక్తి పార్వతీపురంరూరల్‌ : జిల్లాలో వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని పారిశుధ్య పనులపైనా, సీజనల్‌ వ్యాధులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ వీడియో కాన్ఫరెన్స్‌ హాలు నుంచి తహశీల్దార్లు, ఎంపిడిఒలు, ఎఇలు, మెడికల్‌ ఆఫీసర్లతో కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో సీజనల్‌ వ్యాధులు, మలేరియా స్ప్రేయింగ్‌, గ్రామాలు, పట్టణాల్లో పారిశుధ్యంపై ప్రత్యేక డ్రైవ్‌, ఉపాధి హామీ – లేబర్‌ టర్న్‌ అవుట్‌, సగటు వేతనం, తాగునీటి సమస్యలు, జల్‌ జీవన్‌ మిషన్‌లో కొనసాగుతున్న పనులు, మ్యుటేషన్లుపై తదితర అంశాలపై సమీక్షించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో పారిశుధ్య డ్రైవ్‌ ను నిర్వహించాలన్నారు. కాలువల్లో పూడిక తీత, దోమల లార్వా నివారణ పిచికారీ (ఏఎల్‌ఓ) కార్యకలాపాలు, తుప్పల తొలగింపుతో సహా బావులు, కుళాయిలు, బోరుల వద్ద మురుగు నీరు నిల్వ ఉండకుండా వివిధ పనులు చేపట్టారు. కీటకాల నాశనానికి బ్లీచింగ్‌ చల్లారు. మలేరియా దోమల వ్యాప్తి నివారణకు స్ప్రేయింగ్‌ కార్యక్రమాలను మరింత వేగవంతం చేయాలని పేర్కొన్నారు. జిల్లా గ్రామ పంచాయతీ అధికారి, ఎంపిడిఒలు, జిల్లా మలేరియా అధికారి సమన్వయంతో పనిచేస్తూ సంబంధిత సిబ్బంది క్షేత్ర స్థాయిలో పలు కార్యక్రమాలు చేయాలన్నారు. జిల్లాలో మలేరియా, డెంగీ వంటి వ్యాధులు ప్రభలకుండా ఉండేందుకు దోమల నివారణ ఆవశ్యమని, అందుకు ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా ప్రతి ఇంటిలో చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మ్యుటేషన్స్‌, ఇంటిగ్రెటెడ్‌ సర్టిఫికెట్ల జాప్యంలో వేగవంతం చేయాలన్నారు. వర్షాలు రాకముందే ఉపాధి హామీ పనులు పూర్తి చేయాలని పేర్కొన్నారు. జల్‌ జీవన్‌ మిషన్‌లో కొనసాగుతున్న పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ కె.విజయపార్వతి, డిఆర్‌డిఎ పిడి వై.సత్యంనాయుడు, డిపిఒ బలివాడ సత్యనారాయణ, డిఎంఒ డాక్టర్‌ టి.జగన్‌ మోహనరావు, పీడీ డ్వామా కె.రామచంద్రరావు, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఇఇ ఓ.ప్రభాకరరావు పాల్గొన్నారు.వ్యవసాయ అనుబంధ శాఖలతో సమీక్షవ్యవసాయ, ఉద్యాన, మత్స్య పశుసంర్ధకశాఖలతో కలెక్టర్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో వ్యవసాయశాఖ శాఖకు సంబంధించి విత్తనాలు, ఎరువులు, వివిధ పంటల వివరాలు, ఉద్యానశాఖకు సంబంధించి జీడీ, అరటి తోటలకు సంబంధించి రైతులకు ఉన్న సమస్యలు, ఎరువుల వివరాలు , పశుసంవర్ధకశాఖకు సంబంధించి వాక్సిన్లు, సీజనల్‌ వ్యాధులు, హాస్పిటల్‌, సిబ్బంది పనితీరు వివరాలు, మత్స్యశాఖకు సంబందించి స్టాక్‌ పాయింట్‌ వివరాలు, ఇలా శాఖ లకు సంబందించి పలు అంశాలు పై ఆయన సమీక్షించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కె.రాబర్ట్‌పాల్‌, జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి ఎస్‌.మన్మధరావు, ఎపిఎంఐపి అధికారి రాధాకృష్ణ, తదితరులు పాల్గున్నారు.కమిషనర్‌ పై జిల్లా కలెక్టర్‌ సీరియస్‌ సాలూరు: స్థానిక మున్సిపల్‌ కమిషనర్‌ ప్రేమ ప్రసన్న వాణి పై సోమవారం జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది..కలెక్టర్‌ కార్యాలయం నుంచి మన్యం జిల్లా లోని ఎంపిడిఒలు, మున్సిపల్‌ కమిషనర్లతో ఆయన పారిశుద్ధ్య నిర్వహణ, మలేరియా నివారణ చర్యలపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.ఈ కాన్ఫరెన్స్‌కు కమిషనర్‌ ప్రేమ ప్రసన్న వాణి హాజరు కాలేదు.దీంతో ఆయన కమిషనర్‌పై చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు సమాచారం. గతంలో ఎన్నికలకు సంబంధించిన ముఖ్యమైన సమావేశానికి కూడా ఆమె గైరుహాజరు కావడంతో కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ ఆమెకు మెమో జారీ చేశారు. ఇప్పుడు వీడియో కాన్ఫరెన్స్‌కు గైర్హాజరు కావడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అయితే ఈ విషయం తెలుసుకున్న కమిషనర్‌ ప్రసన్న వాణి జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌ను కలిసి తన ఆరోగ్య సమస్యల్ని వివరించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది .అయితే కమిషనర్‌ ప్రసన్న వాణి ఎన్నికల బదిలీల్లో భాగంగా ఇక్కడి కి వచ్చారు. ఆమె స్థాయికి ఈ మున్సిపాలిటీ కమిషనర్‌ చిన్న పోస్ట్‌ కావడంతో ఆమె అయిష్టంగానే ఇక్కడ బాధ్యత లు చేపట్టారు. గడచిన రెండు నెలలుగా ఆమె మున్సిపల్‌ కార్మికుల సమస్యల పరిష్కారంపై కూడా తగిన శ్రద్ధ వహించకపోవడంతో పారిశుద్ధ్య కార్మికులు సోమవారం నుంచి సమ్మెకు దిగారు.

➡️