విద్య కోసం పూలే పోరాటం ఎనలేనిది : కలెక్టర్ షాన్ మోహన్

Nov 28,2024 15:27 #Kakinada

ప్రజాశక్తి – కాకినాడ : వెనుకబడిన తరగతుల హక్కుల కోసం, స్త్రీ విద్యా కోసం అహర్నిశలు పోరాడిన మహోన్నత వ్యక్తి మహాత్మ జ్యోతిరావు ఫూలే అని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ పేర్కొన్నారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే వర్ధంతి సందర్భంగా జిల్లా వెనుకబడిన తరగతుల శాఖ ఆధ్వర్యంలో గురువారం కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి కూడలి వద్ద ఉన్న మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహానికి జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి బీసీ సంక్షేమ అధికారి ఎం లల్లి, బీసీ కార్పొరేషన్ ఈడీ ఎ శ్రీనివాసరావులతోపాటు,  ఇతర అధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జ్యోతిరావు ఫూలే అంటరాని వారికి, అట్టడుగు వర్గాల ప్రజలకు, సాంఘిక న్యాయం కోసం సమాన హక్కుల కోసం సత్యశోధక్ సమాజ్ ను స్థాపించిన గొప్ప వ్యక్తి అన్నారు. వెనుకబడిన తరగతుల హక్కుల కోసం, స్త్రీ విద్యా కోసం ఆయన అహర్నిశలు పోరాడి అత్యున్నత సేవలు అందించారని ఆయన తెలిపారు. బాల్య వివాహాలు, సతీ సహగమనం వంటి దురాచారాలకు వ్యతిరేకంగా పోరాటం చేశారని పూలే ను ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ డీడీ డీ నాగార్జున, కాకినాడ డివిజన్ సహాయ బీసీ సంక్షేమ అధికారి ముత్యాల సుబ్బారావు, జిల్లా బీసీ సంక్షేమ కార్యాలయ పర్యవేక్షకులు, వసతి గృహా సంక్షేమ అధికారి గోవాల సతీష్ జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమం, కార్పొరేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

➡️