అమృత్‌ పనులను త్వరగా పూర్తిచేయాలి : కలెక్టర్‌

Oct 4,2024 00:17

సమీక్షలో కలెక్టర్‌, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా :
అమృత్‌ పథకంలో భాగంగా మొదటి, రెండు దశల పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను పల్నాడు జిల్లా కలెక్టర్‌ పి.అరుణ్‌బాబు ఆదేశించారు. జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని కలెక్టరేట్‌లో ప్రజా ప్రతినిధులతో కలిసి కలెక్టర్‌ గురువారం సమీక్షించారు. నరసరావుపేట మున్సిపాలిటీ పరిధిలో మొదటి దశ కింద రూ.13.53 కోట్లతో చేపట్టిన పనులు 99 శాతం, చిలకలూరిపేట మున్సిపాలిటీ పరిధిలో తాగునీటి సరఫరా రూ.8.82 కోట్లతో చేపట్టిన పనులు 94 శాతం పూర్తయ్యాయని తెలిపారు. నరసరావుపేట, చిలకలూరిపేట ప్రాంతంలో సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకులు, నీటి సరఫరాకు సంబంధించి రూ.153 కోట్ల తో చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేయాలని చెప్పారు. ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభత్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు మాట్లాడుతూ పల్నాడు జిల్లా సమగ్ర అభివృద్ధిపై జిల్లా కలెక్టర్‌ పి.అరుణ్‌ బాబుకు పలు సూచనలు చేశారు. వరికపూడిసెల ప్రాజెక్టు పనులు తక్షణమే ప్రారంభించాలని, ఈ ప్రాజెక్టు పూర్తయితే 100 గ్రామాలకు తాగునీరు, లక్ష ఎకరాలకు పైగా సాగునీరు అందుతుందని, పల్నాడు ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని చెప్పారు. వినుకొండ నియోజకవర్గంలో ఉద్యాన కళాశాల, మాచర్లలో యూనివర్సిటీ అండ్‌ పిజి సెంటర్‌, కారంపూడిలో ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, నరసరావుపేటలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలని కోరారు. వీటి ద్వారా అక్షరాస్యత పరంగా వెనుకబడిన పల్నాడు జిల్లాలో అక్షరాస్యత శాతం మెరుగుపడుతుందన్నారు. పిడుగురాళ్లలో నిర్మాణ దశలో ఉన్న మెడికల్‌ కళాశాల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తేవాలన్నారు. సిఎం చంద్రబాబు చెబుతున్న స్వర్ణాంధ్ర-2047 విజన్‌కు తొలి అడుగులు వెనుకబడిన పల్నాడు జిల్లాలో పడడం ద్వారా ప్రజల్లో విశ్వాసం ఏర్పడేందుకు అవకాశం ఉంటుందన్నారు. అనంతరం వివిధ అభివృద్ధి పనులపై ఎమ్మెల్యేలు డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు, జీవీ ఆంజనేయులు, కన్నా లక్ష్మీనారాయణ, జూలకంటి బ్రహ్మానందరెడ్డి చర్చించారు. పబ్లిక్‌ హెల్త్‌ ఆఫీసర్‌ శ్రీనివాస్‌రెడ్డి, సిపిఒ శ్రీనివాసరావు, మున్సిపల్‌ కమిషనర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

➡️