ప్రజాశక్తి- రాయచోటి అన్నమయ్య జిల్లాలో హార్సిలీ హిల్స్, గుర్రంకొండ వంటి ప్రాంతాలలో అడ్వెంచర్ పర్యాటకానికి మంచి అవకాశాలున్నాయని, దీనిని దష్టిలో పెట్టుకొని జిల్లాను అడ్వెంచర్ టూరిజం హాబుగా అభివద్ధి చేయాలని కలెక్టర్ శ్రీధర్ చామకూరి అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం రాయచోటి కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా టూరిజం కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పర్యాటక శాఖ అధికారి నాగభూషణం జిల్లాలో పర్యాటక రంగానికి ఉన్న మంచి అవకాశాలు, సవాళ్ల గురించి జిల్లా కలెక్టర్‌కు వివరించారు. జిల్లాలో హార్సిలీ హిల్స్‌లో అడ్వెంచర్ టూరిజంకు మంచి అవకాశాలు ఉన్నాయని, జిల్లాలో ఉన్న వీరభద్ర స్వామి దేవాలయం, రెడ్డమ్మ తల్లి దేవాలయం, వంటి ఎన్నో దేవాలయాలు ఉండడం వల్ల టెంపుల్ టూరిజానికి కూడా మంచి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. గుర్రంకొండ ఫోర్ట్ వంటి చారిత్రక కట్టడాలు మన జిల్లాలో ఉండడం వల్ల హెరిటేజ్ టూరిజంకు కూడా మంచి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అనంతరం అన్నమయ్య జిల్లాలో వివిధ పర్యాటక కేంద్రాలలో చేపడుతున్న వివిధ రకాల పనుల గురించి కలెక్టర్‌కు వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాను అడ్వెంచర్ టూరిజం హబ్‌గా అభివద్ధి జరిగేలా చర్యలు తీసుకోవాలని, దీనికి సంబంధించిన పూర్తిస్థాయి ప్రాజెక్టు నివేదికను వెంటనే సమర్పించాలని జిల్లా పర్యాటకశాఖా అధికారిని ఆదేశించారు. జిల్లాలో వివిధ ప్రాంతాలను కలుపుతూ పర్యాటక సర్క్యూట్‌ను అభివద్ధి చేసేలా చర్యలు తీసుకోవాలని, జిల్లాలో ఫుడ్ ఫెస్టివల్ లాంటి కార్యక్రమాలు నిర్వహించి ఎక్కువ మంది పర్యాటకులు జిల్లాకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, మదనపల్లి సబ్ కలెక్టర్ మేఘ స్వరూప్, పర్యాటక శాఖ రీజనల్ డైరెక్టర్ రమణ ప్రసాద్, జిల్లా పర్యాటక కౌన్సిల్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.