రహదారి నిబంధనలు పాటించాలి : కలెక్టర్‌

Jan 16,2025 20:46

ప్రజాశక్తి-విజయనగరం కోట :  రహదారిపై ప్రయాణించేటప్పుడు ప్రతీఒక్కరూ నిబంధనలను పాటించాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ కోరారు. అజాగ్రత్తగా వాహనాన్ని నడపడం వల్లే 90 శాతం ప్రమాదాలు జరుగుతున్నాయని, నిబంధనలను పాటించడం ద్వారా వీటిని నివారించవచ్చునని సూచించారు. వాహనాలను నడిపేటప్పుడు నిర్లక్ష్యాన్ని విడనాడాలన్నారు. తమ కుటుంబాలను, పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని భద్రతా నియమాలను పాటిస్తూ జాగ్రత్తగా వాహనాలను నడపాలని సూచించారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలను కలెక్టర్‌ తమ ఛాంబర్‌లో గురువారం ప్రారంభించారు. దీనికి సంబంధించిన గోడపత్రికలను ఆవిష్కరించారు. నేటినుంచి ఫిబ్రవరి 15 వరకు జరిగే మాసోత్సవాల్లో భాగంగా రహదారి భద్రతా నియమాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివిధ వర్గాల ప్రజలకు, వాహన డ్రైవర్లకు విస్తత స్థాయిలో అవగాహన కల్పించాలని కలెక్టర్‌ కోరారు. కార్యక్రమంలో డిప్యుటీ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ మణికుమార్‌, ఆర్‌టిఒ విమల, మోటార్‌ వెహికల్‌ ఇన్స్పెక్టర్‌ దుర్గాప్రసాద్‌ పాల్గొన్నారు.

➡️