మాతా, శిశు మరణాలు అరికట్టాలి : కలెక్టర్‌

ప్రజాశక్తి – కడప అర్బన్‌ జిల్లాలో మాతా, శిశు మరణాలు అరికట్టాలని కలెక్టర్‌ శివశంకర్‌ వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం కార్యాలయం స్పందన హాల్‌లో మాత మరణాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కాజీపేట, దువ్వూరు, టేకురుపేట, బిధనంచేర్ల, నాగలకట్ట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సంబంధించిన మాత మరణాలపై సమీక్ష నిర్వహించారు. మరణాలకు గల కారణాలను సంబంధిత పిహెచ్‌సి వైద్యులు, ఉన్నత ఆసుపత్రుల స్పెషలిస్ట్‌ వైద్యులు, ప్రయివేట్‌ నర్సింగ్‌ హోమ్‌ వైద్యులతో చర్చించారు. ఆయా ఆసుపత్రులు అందించిన సేవలు గురించి అడిగారు. డిసిహెచ్‌ఎస్‌ సామాజిక ఆరోగ్య కేంద్రాల నుంచి జరుగుతున్న రెఫరల్స్‌ గురించి విచారణ చేయాలని తెలిపారు. మాతృ మరణాలు చోటు చేసుకోకుండా అన్ని స్థాయిలలో సరైన సేవలు అందించాలని తెలిపారు. సమీక్ష సమావేశంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ కె.నాగరాజు, డిఐఒ డాక్టర్‌ ఉమామహేశ్వర కుమార్‌, డిసిహెచ్‌ఎస్‌ డాక్టర్‌ హిమదేవి, స్త్రీల వ్యాధి నిపుణుల విభాగాధిపతి డాక్టర్‌ లక్ష్మీ సుశీల, రిమ్స్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రమాదేవి, ఐసిడిఎస్‌ పీడీ శ్రీలక్ష్మి, డాక్టర్‌ యాదవేంద్రారెడ్డి, డాక్టర్‌ సునీల్‌, డాక్టర్‌ శ్రీవాణి, 108 సురేంద్ర కుమార్‌, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు, ప్రయివేట్‌ నర్సింగ్‌ హోమ్‌ చికిత్స చేసిన వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు, చనిపోయిన వారి బంధువులు హాజరయ్యారు.

➡️