ప్రతి వినతికీ పరిష్కారం చూపించాలి : కలెక్టర్‌

Jan 20,2025 20:06

 గ్రీవెన్స్‌కు 183 వినతులు

ప్రజాశక్తి-విజయనగరంకోట : ప్రజా వినతుల పరిష్కార వేదికలో వచ్చే వినతికి పరిష్కారం చూపాల్సిందేని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా వినతుల పరిష్కారం జరగాలన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి వినతిని ఏవిధంగా పరిష్కరించారనే అంశంపై మూడు దశల్లో తనిఖీ వుంటుందన్నారు. ఆ సందర్భంగా వినతిని అర్జీదారు సంతృప్తి చెందే రీతిలో పరిష్కరించలేదని నిర్ధారణ జరిగితే ఆ వినతిని మళ్లీ తెరచి సంతృప్తికర పరిష్కారం చూపించాల్సి వుంటుందన్నారు. కలెక్టర్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొని జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.సేతుమాధవన్‌, డిఆర్‌ఒ శ్రీనివాసమూర్తి, ఆర్‌డిఒ కీర్తితో కలసి వినతుల స్వీకరణ చేపట్టారు. ఈ సందర్భంగా వినతుల పరిష్కారంపై కలెక్టర్‌ సమీక్షించారు.ప్రజల నుంచి వచ్చిన వినతులను ఆయాశాఖల జిల్లా అధికారులకు అందజేసి వాటిని పరిష్కరించాల్సిందిగా కలెక్టర్‌ ఆదేశించారు. ఈ సందర్భంగా పలు సమస్యల పరిష్కారంపై 183 వినతులు అందాయి. రెవిన్యూ శాఖకు సంబంధించిన అంశాలపై 109, పంచాయతీరాజ్‌ శాఖకు సంబంధించి 40, డిఆర్‌డిఎకు సంబంధించి 11 వినతులు అందాయి. ఈ సందర్భంగా వినతుల పరిష్కారం కోసం ఆయా ప్రభుత్వ శాఖల ద్వారా తీసుకున్న చర్యలపై జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.సేతుమాధవన్‌ అధికారులతో సమీక్షించారు. సక్రమంగా పరిష్కారం కానట్లు ఆడిట్‌లో నిర్ధారించిన వినతులపై ఆయా శాఖల జిల్లా అధికారులను జె.సి. వివరణ అడిగారు. ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలి డెంకాడ మండలం గునుపూరుపేటలో నకిలీ పత్రాలు సృష్టించి భూ ఆక్రమణలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆ గ్రామానికి చెందిన రైతులు అధికారులకు ఫిర్యాదు చేశారు. సర్వే నెంబర్‌ 48- 4లో ఎకరా 73 సెంట్లు జిరాయితీ మెట్ట భూమి పైల అప్పలనాయుడు, పైల ఈశ్వరరావు, పైల కామేశ్వరరావు, పైలశ్రీను, పైల చిన్న ఈశ్వరరావు, బడుకొండ తవిటినాయుడులకు వారసత్వంగా సంక్రమించిందని తెలిపారు. అయితే ఆ భూమిని కొంతమంది రెవెన్యూ అధికారులతో కలిసి నకిలీ పత్రాలు సష్టించి భూ ఆక్రమణకు పాల్పడ్డారని అన్నారు. ఈ అంశంపై స్థానిక మండల రెవెన్యూ అధికారులకు తెలియజేసినా న్యాయం జరగలేదని వారు వాపోయారు. వారసత్వంగా సంక్రమించిన భూమిని హక్కుదారులకు అందజేసి న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.

మా జీతాలు ఇప్పించండి

జిల్లాలోని అంగన్వాడీ కార్యకర్తలకు, ఆయాలకు డిసెంబర్‌ నెల జీతాలు ఇవ్వాలని కోరుతూ కలెక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ను ఎపి అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ నాయకులు కోరారు. ఈమేరకు సోమవారం గ్రీవెన్సులో ఆ యూనియన్‌ జిల్లా గౌరవాధ్యక్షులు వి.లక్ష్మి, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బి.పైడిరాజు, అనసూయ వినతి అందజేశారు. గత ఏడాది డిసెంబర్‌ నెల జీతాలు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అంగన్వాడీలకి అందినా, మన జిల్లాలో పీడీ సెలవులో ఉన్నారనే కారణంతో ఇన్చార్జి పీడీకి డిజిటల్‌ సంతకం లేని సాంకేతిక కారణాలు చూపి జీతాలు వేయలేదని తెలిపారు. పండగ పూట కూడా జిల్లాలో అంగన్వాడీలు అప్పులు చేసి కుటుంబాలతో పండగ జరుపుకునే పరిస్థితి దాపురించిందన్నారు. వెంటనే జీతాలు చెల్లించాలని కలెక్టర్‌ను కోరారు. కలెక్టర్‌ స్పందిస్తూ ఇన్చార్జి పీడీ తో మాట్లాడి మంగళవారం సాయంత్రం లోపు జిల్లాలో అంగన్వాడీలకు జీతాలు ఇవ్వాలని ఆదేశించారు.

21న జిల్లా ఇన్‌ ఛార్జి మంత్రి వంగలపూడి అనిత సమీక్ష

జిల్లా ఇన్‌ ఛార్జి మంత్రి, రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత మంగళవారం జిల్లాకు వస్తున్నట్టు కలెక్టర్‌ తెలిపారు. మధ్యాహ్నం 2 గంటలకు కలెక్టర్‌ కార్యాలయంలో పలు శాఖలపై సమీక్షించనున్నట్టు తెలిపారు. రోడ్లు భవనా శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన గుంతలు లేని రహదారుల కార్యక్రమం ప్రగతి, ఉపాధిహామీ, పంచాయతీరాజ్‌, రెవిన్యూ సదస్సులు తదితర అంశాలపై మంత్రి సమీక్షిస్తారని పేర్కొన్నారు. జిల్లాకు చెందిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ కూడా ఈ సమావేశంలో పాల్గొంటారని తెలిపారు.

➡️