ప్రజాశక్తి – రాయచోటి ఎన్‌టిఆర్ నగర్ గహ నిర్మాణ లేఔట్ లలో ఇళ్ల నిర్మాణ ప్రగతితో పాటు మౌలిక సదుపాయాల కల్పనలను వేగవంతం చేయాలని కలెక్టర్ శ్రీధర్ చామకూరి అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం రాయచోటి రూరల్ దిగువ అబ్బవరం, ఎపి మోడల్ స్కూల్ ఎదురుగా ఉన్న ఎన్‌టిఆర్ నగర్ గహ నిర్మాణ లేఔట్‌లను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కాలనీలలో మంజూరైన గహాలు ఎన్ని, పూర్తయినవి ఎన్ని, ఆర్‌సి, ఆర్‌ఎల్‌లో ఉన్నవి ఎన్ని, వివిధ దశల్లో ఉన్న గహాల సంఖ్య ఎంత అని కలెక్టర్ ఆరా తీశారు. ఎన్‌టిఆర్ నగర్‌లో మొత్తం 93 గృహాలు మంజూరయ్యాయని, 43 గృహాలు ప్తూయ్యాయని, ఆర్‌సి 3, ఆర్‌ఎల్ 9, అలాగే ఎపి మోడల్ స్కూల్ ఎదురుగా ఉన్న లేఅవుట్‌లో 568 ఇళ్లు మంజూరు కాగా, ఇప్పటివరకు 185 గహాలు పూర్తయ్యాయని చెప్పారు. ఆర్‌సి 33, ఆర్‌ఎల్ 98, బిఎల్‌బిబిఎల్‌లో మిగిలిన గహాలు ఉన్నట్లు జిల్లా గహ నిర్మాణ శాఖ పీడీ శివయ్య కలెక్టరుకు వివరించారు. ఆర్‌సి, ఆర్‌ఎల్‌లో ఉన్న గృహాలన్నీ ఈ నెలాఖరులోగా నిర్మాణాలు పూర్తి చేసుకునేలా లబ్ధిదారులను ప్రోత్సహించాలని చెప్పారున. ఈ సందర్భంగా దిగువ అబ్బవరం ఎన్టీఆర్ నగర్‌లో నిర్వహిస్తున్న సిసి రోడ్ల నిర్మాణ ప్రగతిని కలెక్టర్ పరిశీలించారు. మెయిన్ రోడ్డు నుంచి కాలనీలోకి ప్రధాన అప్రోచ్ రోడ్డు 310 మీటర్లు ఉందని, సదరు కాలనీ, ఎదురుగా ఉన్న లే అవుట్‌లలో మొత్తం మీటర్ల మేర సిసి రోడ్లు నిర్మిస్తున్నట్లు పంచాయతీరాజ్ ఎస్‌ఇ దయాకర్ రెడ్డి వివరించారు. సదరు లేఅవుట్లలో కొంత మేర ఇప్పటికే సిసి రోడ్ల నిర్మాణం కూడా పూర్తిచేసే క్యూరింగ్ చేయడం జరుగుతోందని వివరించారు. సిసిరోడ్డు నిర్మాణ పనులను నత్తనడకన కాకుండా యుద్ధ ప్రాతిపదికన వేగవంతంగా పూర్తి చేయాలని, ఇందుకు మిషన్లు, లేబర్‌ను పెంచాలని ఈ నెలాఖరులోగా క్యూరింగ్‌తో సహా సిసి రోడ్లను పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. నీటి ఇబ్బందులు లేకుండా అవసరమైతే ప్రస్తుతం ఉన్న బోర్లను రీఛార్జ్ చేయించాలని ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులను ఆదేశించారు. ఎన్‌టిఆర్ నగర్ ప్రవేశ మార్గం వద్ద ‘పిఎంఏవై-ఎన్టీఆర్ నగర్’ ఆర్చ్ నిర్మాణం వెంటనే చేపట్టాలని పంచాయతీరాజ్ శాఖను ఆదేశించారు. అనంతరం వివిధ అంశాలలో అధికారులతో చర్చించి తగు సూచనలు జారీ చేశారు. కార్యక్రమంలో హౌసింగ్ పీడీ శివయ్య, పంచాయితీ రాజ్ ఎస్‌ఈ దయాకర్ రెడ్డి, ఆర్‌అండ్‌బి డిఇ సహదేవ రెడ్డి, డిఆర్‌డిఎ పీడీి సత్యనారాయణ, మండల స్పెషల్ ఆఫీసర్ గుణశేఖర్ పిళ్ళై, హౌసింగ్ డిఇ సుబ్బరామయ్య, ఎఇ రామ్మోహన్ రెడ్డి, తహశీల్దార్ పుల్లారెడ్డి, ఎంపిడిఒ వెంకటేష్, హౌసింగ్ సిబ్బంది పాల్గొన్నారు.
