మట్టి విగ్రహాలను మాత్రమే వినియోగించాలి : కలెక్టర్‌

ప్రజాశక్తి-రాయచోటి జిల్లాలో వినాయక చవితికి, దసరాకు మట్టి విగ్రహాలను మాత్రమే వినియోగించాలని, ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌తో విగ్రహాలను తయారు చేయకుండా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ శ్రీధర్‌ చామకూరి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం కలెక్టర్‌ ఛాంబర్‌లో కలెక్టర్‌ అధ్యక్షతన, ఆర్‌డిఒలు, మున్సిపల్‌ కమిషనర్లు, డిపిఒలతో పర్యావరణ పరిరక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజంపేట మున్సిపల్‌ కమిషనర్‌ రాంబాబు, వినాయక చవితి, దుర్గ పూజ పండుగల సమయంలో విగ్రహాలను తయారు చేయడం, నిమజ్జనం కోసం, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి రూపొందించిన మార్గదర్శకాలను కలెక్టర్‌కు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో నీటి వనరులు తక్కువగా ఉన్నాయని, కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని తెలిపారు. రాయచోటి, మదనపల్లి, రాజంపేట, బి.కొత్తకోట, మున్సిపాల్టీలలో ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ తో విగ్రహాలు తయారు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అధిక మొత్తంలో జరిమానాలు విధించాలని కమిషనర్లకు, ఆర్‌డిఒలకు ఆదేశాలు జారీ చేశారు. పంచాయతీలలో ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌తో విగ్రహాలు తయారు చేస్తున్న వారిపై సంబంధిత చట్టాలను ఉపయోగించి కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు. జిల్లాలో ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌తో విగ్రహాల తయారీ నియంత్రణకు ఎస్‌ఒపిని తయారు చేయాలని పేర్కొన్నారు. వినాయక చవితికి, దసరాకు విగ్రహాలను మట్టితోనే తయారు చేసే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్నారు. మట్టితో చేసిన విగ్రహాలను మాత్రమే ప్రజలందరూ వినియోగించి పర్యావరణ పరిరక్షణలో ప్రజలందరూ భాగస్వాములు అయ్యేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌, రాజంపేట ఆర్‌డిఒ మోహన్‌రావు, రాయచోటి మున్సిపల్‌ కమిషనర్‌ వాసు, రాజంపేట మున్సిపల్‌ కమిషనర్‌ రాంబాబు, డిపిఒ ధనలక్ష్మి, సిబ్బంది పాల్గొన్నారు.

➡️