ఆర్గానిక్‌ పంటలకు ప్రోత్సాహం : కలెక్టర్‌

Jan 10,2025 20:54

 ప్రజాశక్తి-విజయనగరంకోట :  ఆర్గానిక్‌ ఉత్పత్తులు ఆరోగ్యానికి మంచి చేస్తాయని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌ ఆడిటోరియం వద్ద ప్రకృతి సహజ సిద్ధంగా రైతులు పండించిన ఆర్గానిక్‌ ఉత్పత్తులను ప్రదర్శించారు. ఈ ప్రదర్శనను జిల్లా కలెక్టర్‌ అంబేద్కర్‌, జాయింట్‌ కలెక్టర్‌ సేతు మాధవన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులతో కలెక్టర్‌ మాట్లాడి ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు, ఎంత పెట్టుబడి పెడుతున్నారు, ఎంత లాభం వస్తోంది, అందులో సమస్యలేమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. జిల్లా నలుమూలల నుండి వచ్చిన రైతులు ఈ సంతలో పలు రకాల ఆకు కూరలు, కూరగాయలు, చిరు ధాన్యాలు, ఆర్గానిక్‌ బెల్లం, పలు వెరైటీ ల కొత్త బియ్యం , ఆర్గానిక్‌ వంటకాలు, తిను బండారాలు, అరిసెలు, భోగి పిడకలు, అరటి, జామ పండ్లు తదితర ఉత్పత్తులను ప్రదర్శించారు. మధ్యాహ్నం 1 గంట వరకు విక్రయించగా కలెక్టరేట్‌ , చుట్టూ పక్కల శాఖల నుండి విచ్చేసిన ఉద్యోగులు పెద్ద ఎత్తున హాజరై కొనుగోలు చేసారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మీడియా తో మాట్లాడుతూ జిల్లాలో పెద్ద ఎత్తున ఆర్గానిక్‌ పంటలను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే జిల్లాలో 12 వేల ఎకరాల్లో ఆర్గానిక్‌ పంటలు పండిస్తున్నారని, ప్రజలు కూడా ఈ ఉత్పత్తుల పై ఆసక్తి కనబరుస్తున్నారని, ఈ సాగును పెంచడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి తారక రామారావు, ఇతర వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.

➡️