ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : టీచర్స్ ఎలిజిబులిటి టెస్ట్‌లో అత్యున్నత ప్రతిభ చూపి, రాష్ట్రస్థాయిలో మొదటి, రెండవ ర్యాంకులు సాధించిన విద్యార్థినులను జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభినందించారు. టెట్‌లో జిల్లా కేంద్రంలోని అంబటిసత్రంకు చెందిన కోండ్రు అశ్వని ఎస్‌జిటి విభాగంలో 150కి 150 మార్కులను, దాసరి ధనలక్ష్మి 149.99 మార్కులను సాధించి రాష్ట్రస్థాయిలో ప్రథమ, ద్వితీయ స్థానంలో నిలిచారు. అలాగే 149.56 మార్కులను సాధించిన దేవ హారిక మరికొందరితోపాటు తృతీయ స్థానంలో నిలిచారు. ఈ ముగ్గురినీ జిల్లా కలెక్టర్ అంబేద్కర్ తమ ఛాంబర్‌లో అభినందిం చారు. ఇదే పట్టుదలతో చదివి ఉపాధ్యాయులుగా ఎంపిక కావాలని, మరింత ఉన్నత స్థానాలను సాధించాలని కలెక్టర్ ఆకాంక్షించారు. జిల్లా విద్యాశాఖాధికారి మాణిక్యం నాయుడు కూడా పాల్గొన్నారు.ఇదిలా ఉండగా రాష్ట్రస్థాయిలో మొదటి స్థానంలో నిలిచిన అశ్విని ..తన తల్లిదండ్రులు వెంకటలక్ష్మి, శంకర్రావు ప్రోత్సాహంతోనే విజయం సాధ్యమైందని తెలిపింది. తండ్రి ఆటో నడుపుతూ తనను చదివించారని తెలిపింది.