- ఇది ఆరంభం మాత్రమే : డివైఎఫ్‌ఐ రామన్న
ప్రజాశక్తి – కర్నూలు కార్పొరేషన్ : మెగా డిఎస్‌సి వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కర్నూలు కలెక్టరేట్‌ను డిఎస్‌సి అభ్యర్థులు ముట్టడించారు. అంతకుముందు డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో బిర్లా కాంపౌండ్ నుంచి కలెక్టరేట్ వరకూ ర్యాలీ నిర్వహించి అక్కడే బైఠాయించారు. ఎంతసేపటికి కలెక్టర్ బయటకు రాకపోవడంతో ఒక్కసారిగా గేట్లు తోసుకుంటూ లోపలికి వెళ్లేందుకు అభ్యర్థులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. సిఐ కలుగజేసుకుని డిప్యూటీ స్పెషల్ కలెక్టర్ నాగలక్ష్మిని కార్యాలయం నుంచి బయటకు పిలిపించి వినతిపత్రం అందజేయించారు. కలెక్టర్ బయటకు రావాల్సిందే అంటూ మూడు గంటల పాటు అభ్యర్థులు ఆందోళనకు దిగారు. చివరకు పదిమంది అభ్యర్థులను కలెక్టర్ కార్యాలయంలోకి తీసుకువెళ్లగా అక్కడి కలెక్టర్, జెసి లేరు. ఈ ఉద్యమం ఆరంభం మాత్రమే అని, భవిష్యత్తులో మరింత పెద్దఎత్తున్న ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు.
అంతకు ముందు ధర్నానుద్దేశించి డివైఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామన్న మాట్లాడుతూ.. టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబునాయుడు మెగా డిఎస్‌సిపై మొదటి సంతకం చేసి అభ్యర్థులను మోసం చేశారని విమర్శించారు. పది నెలలు గడిచినా మొదటి సంతకానికి దిక్కులేకపోగా… వారంలో మెగా డిఎస్‌సి అని ముఖ్యమంత్రి, త్వరలోనే మెగా డిఎస్‌సి విడుదల చేస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటనలు చేస్తూ అభ్యర్థులను మోసగిస్తున్నారన్నారు. వెంటనే మెగా డిఎస్‌సి విడుదల చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి రంగప్ప మాట్లాడుతూ.. నిరుద్యోగ ఉద్యమానికి అండగా ఉంటామన్నారు. డివైఎఫ్‌ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి శిరీష, డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు రాఘవేంద్ర, జిల్లా ఉపాధ్యక్షులు అబ్దుల్లా, జిల్లా సహాయ కార్యదర్శి హుస్సేన్‌బాష, నిరుద్యోగ నాయకులు చంద్రశేఖర్, వినరు, జగన్ మోహన్ , పలువురు డిఎస్‌సి అభ్యర్థులు పాల్గొన్నారు.