సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ నాగలక్ష్మి
ప్రజాశక్తి-గుంటూరు : ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ప్రతిపాదించిన ఆగ్జలరీ పోలింగ్ కేంద్రాలను రాజకీయ పార్టీలు పరిశించి, ఖరారు చేస్తే జాబితాను ప్రధాన ఎన్నికల అధికారికి పంపిస్తామని రిటర్నింగ్ అధికారి అయిన జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి కోరారు. ఈ అంశంపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టరేట్‌లో సోమవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గుంటూరు జిల్లాలో ఇప్పటికే 118 పోలింగ్ కేంద్రాలున్నాయని వాటిలో వెయ్యి ఓట్లకు పైగా పోలింగ్ స్టేషన్లకు అదనంగా వేరొక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయటానికి 39 పోలింగ్ కేంద్రాలను ప్రతిపాదించామని చెప్పారు. ప్రతిపాదించిన పోలింగ్ కేంద్రాలపై రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఏఆర్‌ఓలతో చర్చించి, 8 ఆగ్జలరీ పోలింగ్ కేంద్రాలను తగ్గించామని తెలిపారు. దీని ప్రకారం జిల్లాలో మొత్తం 149 పోలింగ్ స్టేషన్ల జాబితాను సిఈఓకు పంపించడానికి ఏఆర్‌ఓలు వెంటనే ప్రతిపాదనలు పంపాలన్నారు. మిగిలిన ఏలూరు, కృష్ణ, ఎన్‌టిఆర్ బాపట్ల, పల్నాడు జిల్లాలో ఆగ్జలరీ పోలింగ్ కేంద్రాల వివరాలు అందిన తర్వాత నియోజకవర్గానికి సంబంధించి మొత్తం పోలింగ్ కేంద్రాలను ప్రకటిస్తామని చెప్పారు. ఇప్పటి వరకూ నమోదైన ఓటర్లలో పురుషులు 2,06,225 మంది, మహిళలు 1,40,344 మంది, ట్రాన్స్ జెండర్స్ 45 మంది మొత్తం 3,46,614 మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారని తెలిపారు. సమావేశంలో తెనాలి సబ్ కలెక్టర్ సంజనాసింహా, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గంగరాజు, డిఆర్‌ఓ షేక్.ఖాజావలి, ఆర్డీఓ కె.శ్రీనివాసరావుతో, బిజెపి నుండి సిహెచ్.కుమారగౌడ్, సిపిఎం నుండి వై.కృష్ణకాంత్, టిడిపి నుండి కె.శివరామయ్య, జనసేన నుండి గాదె వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ నుండి బి.సునీల్, ఆప్ నుండి డాక్టర్ టి.సేవాకుమార్, బిఎస్‌పి నుండి సిహెచ్.వాసు పాల్గొన్నారు.
