ముఖ్యమంత్రి పర్యటన మార్గాల్లో ఏర్పాట్లను పరిశీలించిన కమిషనర్ మౌర్య

Oct 4,2024 15:49 #Tirupati

ప్రజాశక్తి – తిరుపతి టౌన్ : తిరుమల తిరుపతి పర్యటన నిమిత్తం రానున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన మార్గాల్లో పారిశుద్ధ్య పనులను, ఏర్పాట్లను శుక్రవారం ఉదయం నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య అధికారులతో కలిసి పరిశీలించారు. శుక్రవారం సాయంత్రం తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్బంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా తిరుమలకు రానున్న నేపథ్యంలో తనపల్లి క్రాస్ నుండి శ్రీనివాససేతు ఫ్లైఓవర్ మీదుగా అలిపిరి వరకు పారిశుద్ధ్య పనులను ఇంజనీరింగ్ హెల్త్ అధికారులతో కలిసి తనిఖీ చేశారు. పారిశుద్ధ్య పనులు మెరుగ్గా ఉండాలని, బారికేడ్లు పటిష్టంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. రోడ్లపైన ఎక్కడా గుంతలు లేకుండా చూడాలని, ముఖ్యమంత్రి పర్యటన మార్గంలో ఫ్లెక్సీలు అడ్డం ఉండకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, సూపరింటెండెంట్ మోహన్, మునిసిపల్ ఇంజినీర్లు తులసికుమార్, గోమతి, డి.ఈ.మహేష్, రాజు, ఏసిపి బాలాజీ, రమణ, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, శానిటరీ సూపర్ వైజర్ చెంచయ్య, తదితరులు ఉన్నారు.

➡️