ప్రజాశక్తి – విజయనగరం టౌన్ : భవన నిర్మాణ అనుమతులకై క్షేత్రస్థాయి పరిశీలన తప్పనిసరిగా చేపట్టాలని ప్రణాళిక అధికారులకు, సిబ్బందికి విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ పల్లి నల్లనయ్య ఆదేశించారు. భవన నిర్మాణ అనుమతులకై వచ్చిన దరఖాస్తులను పరిశీలించే నిమిత్తం ప్రణాళిక అధికారులు ఆయా భవన నిర్మాణ ప్రాంతాలకు వెళ్లి వివరాలను సేకరించారు. పూల్ బాగ్ ప్రాంతంలో అసిస్టెంట్ సిటీ ప్లానర్ హరిబాబు, ప్రణాళిక సిబ్బందితో వెళ్లి అక్కడ భవన నిర్మాణ అనుమతులపై వచ్చిన దరఖాస్తును, వాటి వివరాలను నమోదు చేసుకున్నారు. హద్దులు, ఇతర అంశాలను గమనించారు. అలాగే హనుమాన్ నగర్ లో అనుమతి లేకుండా పై అంతస్తు నిర్మాణాన్ని ప్రణాళిక సిబ్బంది అడ్డుకున్నారు. గోడల వరకు లేపిన నిర్మాణాన్ని కూల్చివేశారు. యం.జి.రోడ్ నందు అనుమతి లేకుండా నిర్మాణాలు చేపడుతున్న భవనానికి వేసిన సెంట్రింగ్ పనులను సిబ్బంది అడ్డుకున్నారు.వాటిని సిబ్బంది తొలగించి వేశారు. ఈ సందర్భంగా కమిషనర్ పల్లి నల్లనయ్య మాట్లాడుతూ అనుమతి లేని నిర్మాణాలను ఉపేక్షించుబోమని అనేక పర్యాయాలు తెలియజేసామన్నారు. అయినా కొందరు బేఖాతరు చేస్తూ నిర్మాణాలు చేపట్టడాన్ని సహించబోమన్నారు. తక్షణమే తమ ప్రణాళిక సిబ్బంది వెళ్లి అనుమతులు లేని అక్రమ నిర్మాణాలను నిలిపివేస్తారని మరోసారి స్పష్టం చేశారు.