ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : అక్టోబర్ 14, 15 తేదీల్లో నగరంలో జరగనున్న పైడితల్లి అమ్మవారి ఉత్సవాలకు నగర పాలక సంస్థ నుంచి సుమారుగా రూ.50 లక్షల ఖర్చుతో సౌకర్యాల కల్పనకు ఏర్పాటు చేస్తున్నామని, పండగకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించడం కోసం నగర పాలక సంస్థ ద్వారా కృషి చేయడం జరుగుతుందని కమిషనర్ పి.నల్లనయ్య ప్రజాశక్తి కి తెలిపారు. పండగ ఏర్పాట్లు గురుంచి తీసుకుంటున్న చర్యలు గురుంచి ప్రజాశక్తి కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వివరించారు.
ప్రశ్న – పైడితల్లి అమ్మవారి ఉత్సవాలకు ఏర్పాట్లు ఏ విధంగా చేస్తున్నారు ?
కమిషనర్ – పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించే విధంగా ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం ఆదేశాల మేరకు ఇప్పటకీ అన్ని శాఖలు సహకారంతో కార్యాచరణ ప్రణాళికను వేసుకొని అమలు చేయడం జరుగుతుందన్నారు. ఇంజినీరింగ్, ప్రజారోగ్య, టౌన్ ప్లానింగ్, పోలీస్, రెవెన్యూ, విద్యుత్ ఇలా అనేక శాఖల అధికారులతో సమావేశాలు పెట్టి శాఖా పరంగా చేపట్టాల్సిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
ప్రశ్న – పారిశుధ్యం నిర్వహణపై తీసుకున్న చర్యలు ?
కమిషనర్ – పండగ మూడు రోజులు సుమారుగా 4 లక్షల వరకు బయట నుంచి భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో అదనంగా మూడు రోజులకుగాను 450 మంది ప్రైవేటు శానిటేషన్ సిబ్బందినీ తీసుకోవడం జరుగుతుందన్నారు. ఆలయం చుట్టూ, నగరంలో రద్దీగా ఉండే ప్రాంతాల్లో సిబ్బందితో పారిశుధ్య పనులను చేయించనున్నామని తెలిపారు. మూడు షిఫ్ట్ లలో పనులు చేయనున్నారన్నారు. అదే విధంగా సిరిమాను వెంట 100 మంది వరకు పారిశుధ్య సిబ్బంది పని చేయనున్నారని అన్నారు. భక్తులు వేసే అరటి పళ్ళు ఎప్పటికప్పుడు తీసేసి రోడ్డును శుభ్రంగా ఉంచే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
ప్రశ్న – నగరంలో రోడ్లు గుంతలమయంగా మారాయి, రోడ్లు కోసం చేపట్టిన చర్యలు ఏమిటి ?
కమిషనర్ – ఇటీవల కురిసిన వర్షాలకు, సిరిమాను హుకుమ్ పేట నుంచి వచ్చే రోడ్డు పనులు ఇప్పటికే ప్రారంభించడం జరిగిందన్నారు. రోడ్డు ప్యాచ్ వర్క్ లు రూ.6.60 లక్షలు తో బిటి , సి సి రోడ్లుకు ప్యాచ్ వర్క్ కు కేటాయించి పనులు చేయించడం జరుగుతుందన్నారు. హుకుమ్ పేట నుంచి సిరిమాను వచ్చే రోడ్డు పనులు రూ.12.40 లక్షలతో చేపడుతున్నామని పనులు చివరి దశకు వచ్చాయన్నారు.
ప్రశ్న – భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు ?
కమిషనర్ – పైడితల్లి అమ్మవారి ఉత్సవాలకు వచ్చే భక్తులకు నగరంలో 20 ప్రాంతాల్లో తాత్కాలిక మరుగుదొడ్లు, తాగునీటి కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. అదే విధంగా పండగ మూడు రోజులు పాటు తాగునీరు సరఫరా కుళాయిలు ద్వారా అన్ని డివిజన్లకు సరఫరా చేయడం జరుగుతుందన్నారు. కుళాయిలు లేని ప్రాంతాలకు రోజు ట్యాంకర్లు ద్వారా నీటి సరఫరా చేయడం జరుగుతుందన్నారు.
ప్రశ్న – నగరం ప్రత్యేక ఆకర్షణగా ఉండేందుకు చేపడుతున్న చర్యలు ?
కమిషనర్ – పండగ వైభవం తెలిసే విధంగా నగరంలో ఉన్న జంక్షన్లలో ప్రత్యేక లైటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. అదే విధంగా విగ్రహాలు వద్ద లైటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. వీటికి తోడు హార్డింగ్స్ 12 పాయింట్‌ల వద్ద, స్వాగత ద్వారాలు 11 ప్రాంతాల్లో, అదే విధంగా ప్లెక్సీలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.
ప్రశ్న – సిరిమాను తిరిగే ప్రాంతంలో ఎన్ని శిథిలావస్థలో ఉన్న భవనాలు ఉన్నాయి.. మీరు తీసుకున్న జాగ్రత్తలు ఏమిటి ?
కమిషనర్ – సిరిమాను మూడు లాంతర్లు నుంచి కోట జంక్షన్ వైపు తిరిగే రోడ్డు లో 12 భవనాలు శిథిలావస్థలో ఉన్నట్లు గుర్తించడం జరిగిందన్నారు. భవనాల మీదకు భక్తులు వెళ్లకుండా నోటీసులు పెట్టడంతోపాటు మనుష్యులను పెట్టీ ఎవ్వరూ ఎక్కకుండా నియంత్రించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.